Share News

ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా పరికరాలు

ABN , Publish Date - Dec 08 , 2025 | 01:04 AM

విద్యార్థుల శారీరక, మానసిక దారుఢ్యం పెంపొం దించేందుకుగాను ప్రభుత్వం పాఠశాలలకు క్రీడా పరికరాలు పంపిణీ చేసింది.

ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా పరికరాలు

ప్రాథమిక పాఠశాలలకు రూ.10 వేలు, యూపీ స్కూళ్లకు రూ.17 వేలు

ఉన్నత పాఠశాలలకు రూ.30 వేల విలువైనవి పంపిణీ

విశాఖపట్నం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి):

విద్యార్థుల శారీరక, మానసిక దారుఢ్యం పెంపొం దించేందుకుగాను ప్రభుత్వం పాఠశాలలకు క్రీడా పరికరాలు పంపిణీ చేసింది. ప్రాథమిక పాఠశాలలకు రూ.10 వేలు, యూపీ పాఠశాలలకు రూ.17 వేలు, ఉ న్నత పాఠశాలలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల విలువైన పరికరాలు సరఫరా చేసింది.

ప్రతి పాఠశాల నుంచి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యా శాఖ ఇండెంట్‌ తీసుకుంది. ఈ మేరకు క్రికెట్‌ బ్యాట్లు, బాల్స్‌, చెస్‌, క్యారమ్‌ బోర్డు, వాలీబాల్‌, త్రోబాల్‌, స్కిప్పింగ్‌ రోప్స్‌, టెన్నికాయిట్‌, షటిల్‌, ఫుట్‌బాల్‌, హాకీ, హ్యాండ్‌బాల్‌, ఖో-ఖో కిట్లు సరఫరా చేశారు. జిల్లాలో ప్రభుత్వ, జడ్పీ, జీవీఎంసీ యాజమాన్యాల పరిధిలో 565 పాఠశాలలు ఉండగా, ప్రతి పాఠశాలకు కిట్లు వచ్చాయి. స్కూల్‌ కాంప్లెక్స్‌లకు వచ్చిన కిట్లను ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు తీసుకువెళ్లారు. గతంలో ఉన్నతాధికారులకు తోచింది కొనుగోలు చేసి పాఠశాలలకు పంపేవారని, హెచ్‌ఎంల ఇండెంట్‌ మేరకు కిట్లు సరఫరా చేయడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఈ పర్యాయం నాణ్యతతో కూడిన పరికరాలు సరఫరా చేశారని జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి ఎన్‌.లలిత్‌కుమార్‌ తెలిపారు. మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్‌ చొరవ తీసుకోవడంతో విద్యార్థుల అభిరుచికి తగిన కిట్లు వచ్చాయన్నారు.

Updated Date - Dec 08 , 2025 | 01:04 AM