వేగంగా పెండింగ్ భూ సమస్యల పరిష్కారం
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:36 PM
జిల్లాలో పెండింగ్ భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశం
పాడేరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెండింగ్ భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం జిల్లాలోని రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అలాగే భూ సర్వేకు సంబంధించి వీఆర్వోలు లేదా తహశీల్దార్ల లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న వాటిని పరిశీలించి తక్షణమే క్లియర్ చేయాలన్నారు. ఆయా పెండింగ్ సమస్యలపై సబ్‌కలెక్టర్లు తరచూ పర్యవేక్షించాలని సూచించారు. అన్నదాత సుఖీభవ పెండింగ్ సమస్యలు, భూముల క్రమబద్ధీకరణ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. భూములకు ఆధార్ సీడింగ్ ప్రక్రియ, మ్యుటేషన్ సవరణలు పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న జనన, కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి తక్షణమే అర్హులైన వారికి ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలన్నారు. రేషన్ దుకాణాల్లో రేషన్ పంపిణీ తీరును పౌరసరఫరాల శాఖాధికారులు పర్యవేక్షించాలని సూచించారు. అలాగే మీకోసం కార్యక్రమంలో స్వీకరిస్తున్న వినతులను పక్కాగా పరిశీలించి ఆయా సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం పీజీఆర్‌ఎస్ నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నదని, అధికారులు అలక్ష్యంగా ఉండవద్దన్నారు. అటవీ శాఖకు సంబంధించిన స్థలాలపై రీ సర్వే చేసి ఆయా సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన మ్యాప్‌లు, రిజిస్టర్లు, జియో మ్యాపింగ్, తదితరులను సమన్వయం చేసుకొని పక్కాగా రెవెన్యూ రికార్డులను రూపొందించుకోవాలన్నారు. రెవెన్యూ సేవలపై ప్రజల నుంచి ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నదని, ప్రజలు సంతృప్తి చెందేలా సేవలు అందించాలని కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో శ్రీపూజ, రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్, రంపచోడవరం సబ్‌కలెక్టర్ శుభం నొక్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, ఆర్‌డీవో ఎంవీఎస్.లోకేశ్వరరావు, జిల్లాలోని 22 మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.