మ్యూజియం పనులు వేగవంతం
ABN , Publish Date - May 16 , 2025 | 12:33 AM
లంబసింగిలోని స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ ఆదేశించారు. గురువారం చింతపల్లి మండలంలో పాడేరు ఐటీడీఏ పీవో, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్ గౌడతో కలిసి పర్యటించిన ముఖ్యకార్యదర్శి నిర్మాణంలో ఉన్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పనులను పరిశీలించారు.
- నవంబరు నాటికి పనులు పూర్తి చేయాలి
- ప్రారంభానికి హాజరుకానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
- రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్
చింతపల్లి, మే 15 (ఆంధ్రజ్యోతి): లంబసింగిలోని స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ ఆదేశించారు. గురువారం చింతపల్లి మండలంలో పాడేరు ఐటీడీఏ పీవో, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్ గౌడతో కలిసి పర్యటించిన ముఖ్యకార్యదర్శి నిర్మాణంలో ఉన్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పనులు జాప్యం కావడంతో గత కాంట్రాక్టర్‌ను తొలగించి మూడు ప్యాకేజీలుగా నిర్మాణాలకు టెండర్లు పిలిచామన్నారు. రెండో విడత నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. నిర్మాణ బాధ్యతలు పొందిన ఇద్దరు కాంట్రాక్టర్లతో ఇంజనీరింగ్ అధికారులు సకాలంలో పనులు పూర్తి చేయుంచాలన్నారు. నవంబరు నాటికి నిర్మాణాలు పూర్తికావాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు మ్యూజియం ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారని చెప్పారు. గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం అత్యంత సుందరంగా, దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళిక ఆధారంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ ఏడాది పర్యాటక సీజన్ ప్రారంభం నాటికి మ్యూజియాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. మ్యూజియం నిర్మాణాలకు నిధుల కొరత లేదన్నారు. అనంతరం రాజుబంధ గ్రామంలో పర్యటించిన ఆయన నిర్మాణాలు పూర్తి చేసిన మల్టీపర్పస్ భవనాన్ని పరిశీలించారు. నిర్మాణాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో గిరిజనులు నిర్మించుకుంటున్న పక్కా గృహాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఎస్.శ్రీనివాస్, పాడేరు ఈఈ డేవిడ్ రాజు, డీఈఈ జి.రఘునాథరావునాయుడు, ఏఈఈ యాదకిశోర్ పాల్గొన్నారు.