పేదల ఇళ్ల నిర్మాణం వేగవంతం
ABN , Publish Date - Jul 19 , 2025 | 12:46 AM
పేదల ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది.
శ్రావణ మాసంలో గృహ ప్రవేశాలు
జిల్లా 21,272 ఇళ్లు సిద్ధం
విశాఖపట్నం, జూలై 18 (ఆంధ్రజ్యోతి):
పేదల ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. జిల్లాలో ఇప్పటివరకూ పూర్తయిన 21,272 ఇళ్లను వచ్చే శ్రావణమాసంలో లబ్ధిదారులకు అందజేసి, వారితో గృహ ప్రవేశాలు చేయించాల్సిందిగా అధికారులను ఆదేశించింది. లబ్ధిదారులు సొంతంగా నిర్మించుకున్నవి, కాంట్రాక్టర్లు నిర్మించినవి కలిపి జిల్లాలో సుమారు 30 వేల ఇళ్ల వరకూ ఉన్నాయి. 30 వేల ఇళ్లకు చుట్టూ, లోపల ప్లాస్టరింగ్ పూర్తిచేశారు. జిల్లాలోని నాలుగు గ్రామీణ మండలాల్లో లబ్ధిదారులు స్వయంగా కొన్నింటిని నిర్మించుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ.1.5 లక్షలు, ఉపాధి పథకం నిధులు రూ.30 వేలు వెరసి రూ.1.8 లక్షలకు తోడుగా సొంతంగా మరికొంత సొమ్ము వెచ్చించారు. కాగా నగర శివారు ప్రాంతాల్లో రూపొందించిన లేఅవుట్‌లలో సెంటు స్థలంలో నిర్మించిన ఇళ్లు కూడా కొన్ని పూర్తయ్యాయని, వాటిల్లో కూడా గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు చేస్తున్నామని హౌసింగ్ పీడీ సత్తిబాబు తెలిపారు. గృహ ప్రవేశాలు జరిగే కాలనీల్లో తాగునీరు, విద్యుత్ సదుపాయం కల్పించాలని ఆయా విభాగాలను కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిధర్ ప్రసాద్ ఆదేశించారన్నారు.
గంజాయి సేవిస్తున్న వారిని పట్టించిన డ్రోన్
పెందుర్తి, జూలై 18 (ఆంధ్రజ్యోతి):
గుట్టుగా గంజాయి సేవిస్తూ మత్తులో తేలుతున్న యువకులను డ్రోన్ పట్టించింది. సుజాతనగర్ సమీపాన నాగమల్లి లేఅవుట్ కొండ ప్రాంతంలో శుక్రవారం సీఐ సతీశ్‌కుమార్ ఆదేశాలతో పోలీసులు డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు. ఆ సమయంలో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా తుప్పల్లో సంచరిస్తునట్టు గమనించారు. డ్రోన్ చూపిన చిత్రం ఆధారంగా పోలీసులు అక్కడికి చేరుకోవడంతో గంజాయి సేవిస్తున్న యువకులు పట్టుబడ్డారు. తనిఖీల్లో వారి నుంచి 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
ఆర్టీసీ ఎలక్ర్టిక్ బస్సుల కోసం రూ.12 కోట్లతో చార్జింగ్ స్టేషన్లు
మొదటి దశలో గాజువాక, సింహాచలంలో ఏర్పాటు
వంద బస్సులకే ఒకేసారి చార్జింగ్ చేసే వీలు
ద్వారకా బస్‌స్టేషన్, జూలై 18 (ఆంధ్రజ్యోతి):
నగరంలో ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ బస్సుల కోసం చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సింహాచలం, గాజువాక డిపోల పరిధిలో మొదటి దశలో రెండు స్టేషన్లను రూ.12 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసేందుకు ఈపీడీసీఎల్, ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ మేరకు నివేదికను ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపారు. గాజువాక సబ్‌స్టేషన్ నుంచి అక్కడి డిపో, సింహాచలం సబ్ స్టేషన్ నుంచి అక్కడి డిపోలకు ప్రత్యేక లైన్లు వేసేందుకు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు అంచనాలను నివేదికలో పొందుపరిచారు. ఉన్నతాధికారుల నుంచి ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. మొదటి దశలో గాజువాక, సింహాచలం డిపోల పక్కన ఒక్కో చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో డిపోలో మొదటి దశ వంద బస్సులకు ఒకేసారి చార్జింగ్ చేసేందుకు వీలుగా పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు.