స్వచ్ఛాంధ్ర పనుల్లో వేగం
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:09 AM
స్వచ్ఛ ఆంధ్ర సాధనే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జిల్లాలో పలు గ్రామ పంచాయతీలు పరిశుభ్రత పనులు చేపట్టడంలో ముందు వరుసలో ఉండడంతో ఇటీవల పురస్కారాలను సొంతం చేసుకున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యంపై పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. గ్రామ పంచాయతీలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు సైతం ఇతరత్రా పథకాలకు మళ్లించిన సంగతి తెలిసిందే.
గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంపునకు అధిక ప్రాధాన్యం
జిల్లాకు కొత్తగా 113 సామూహిక మరుగుదొడ్లు మంజూరు
ఒక్కోదానికి రూ.3 లక్షలు కేటాయింపు
ఇప్పటికే 72 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి
158 అంగన్‌వాడీ కేంద్రాల్లో సైతం..
746 కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
స్వచ్ఛ ఆంధ్ర సాధనే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జిల్లాలో పలు గ్రామ పంచాయతీలు పరిశుభ్రత పనులు చేపట్టడంలో ముందు వరుసలో ఉండడంతో ఇటీవల పురస్కారాలను సొంతం చేసుకున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యంపై పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. గ్రామ పంచాయతీలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు సైతం ఇతరత్రా పథకాలకు మళ్లించిన సంగతి తెలిసిందే. గత ఐదేళ్లలో గ్రామాల్లో ఉన్న సామాజిక మరుగుదొడ్లకు మరమ్మతలు చేపట్టకపోగా, కొత్తవి నిర్మించాలనే ఆలోచనే చేయలేదు. దీంతో అనేక గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత స్వచ్ఛ భారత్ మిషన్-2.0, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంపు కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది. తొలి విడతలో ఐదు వేలు, అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో వీటి నిర్మాణాలు చేపడుతున్నారు ఇంకా వ్యక్తగత మరుగుదొడ్లను నిర్మించనున్నారు. ఎంపీడీఓల నివేదికల ప్రకారం జిల్లాలో 113 సామూహిక మరుగుదొడ్లను నిర్మించేందుకు ప్రతి మరుగుదొడ్డికి రూ.3 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే 72 మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తికాగా మిగిలినవి వివిధ దశల్లో వున్నాయి. ఇంకా 158 అంగన్‌వాడీ కేంద్రాల ప్రాంగణాల్లో మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. ఒక్కో మరుగుదొడ్డికి రూ.36 వేలు ఖర్చు చేస్తున్నారు. గృహ అవసరాలకు వినియోగించే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు కూడా నిధులు మంజూరు చేస్తున్నారు. 2014-2019 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో వున్నప్పుడు గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 60 శాతానికి పైగా గృహాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకం అటకెక్కింది. కూటమి అధికారంలోకి రావడంతో వ్యక్తిగత మరుగుదొడ్లు లేని కుటుంబాలకు కొత్తగా ఓడీఎఫ్ కింద మరుగుదొడ్లను నిర్మించుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నది. ఒక్కో మరుగుదొడ్డికి రూ.15 వేల చొప్పున ప్రభుత్వం మంజూరు చేస్తున్నది. తొలివిడలో 746 కుటుంబాలకు మరుగుదొడ్ల నిర్మాణానికి ఇటీవల నిధులు మంజూరు చేసింది. ఆయా పనులు జోరుగా సాగుతున్నాయిని ఆర్‌బ్ల్యూఎస్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చెబుతున్నారు.