ఎన్నికల సంబంధిత ప్రక్రియలపై ప్రత్యేక శిక్షణలు
ABN , Publish Date - Nov 27 , 2025 | 11:34 PM
జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలపై అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణలను అందిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ తెలిపారు.
సీఈవో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ దినేశ్‌కుమార్ వెల్లడి
పాడేరు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలపై అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణలను అందిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ తెలిపారు. ఎన్నికల సంబంధిత ప్రక్రియలపై రాష్ట్ర ఎన్నిక ప్రధానాధికారి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాకు సంబంధించిన అంశాలను ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు. ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, మ్యాపింగ్, తదితర ప్రక్రియలు, నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిల్లోని ప్రత్యేక శిక్షణల గురించి కలెక్టర్ తెలిపారు. ఆయా ప్రత్యేక శిక్షణలు, సమావేశాలతో అధికారులు, సిబ్బందికి అవసరమైన ఎన్నికల ప్రక్రియలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా బూత్ లెవల్ అధికారులకు రెండు విడతల శిక్షణలు పూర్తి చేశామని తెలిపారు. అలాగే 2002 ఓటరు జాబితాను 2025 ఓటరు జాబితాతో పరిశీలన జరిపి మ్యాపింగ్ చేస్తున్నామని, ప్రస్తుతానికి ఆ ప్రక్రియ 28 శాతం పూర్తయిందన్నారు. పాడేరు నియోజకవర్గంలో 1,200 మంది ఓటర్లు దాటిన పోలింగ్ స్టేషన్లను గుర్తించి, కొత్తగా మరో 25 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు మ్యాపింగ్ జరుగుతుందన్నారు. ఆయా పనులన్నీ త్వరలోనే పక్కాగా పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ దినేశ్‌కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో శ్రీపూజ, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎంవీఎస్.లోకేశ్వరరావు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.