Share News

వడదెబ్బ బాధితులకు ప్రత్యేక వార్డు

ABN , Publish Date - May 04 , 2025 | 12:48 AM

ఎండ తీవ్రత ఈ నెలలో మరింత పెరిగే అవకాశం ఉన్నందున వడదెబ్బ బాధితులకు తక్షణం చికిత్స అందించేందుకు కేజీహెచ్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

వడదెబ్బ బాధితులకు ప్రత్యేక వార్డు

  • కేజీహెచ్‌లో నాలుగు పడకలతో ఏర్పాటు

  • శరీరం వేడిగా మారినా, ఊపిరి సలపనట్టు అనిపించినా అప్రమత్తం కావాలని వైద్యుల హెచ్చరిక

విశాఖపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి):

ఎండ తీవ్రత ఈ నెలలో మరింత పెరిగే అవకాశం ఉన్నందున వడదెబ్బ బాధితులకు తక్షణం చికిత్స అందించేందుకు కేజీహెచ్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు నాలుగు పడకలతో ప్రత్యేకంగా హీట్‌ స్ర్టోక్‌ వార్డును సిద్ధం చేశారు. క్యాజువాల్టీ బిల్డింగ్‌లోని మొదటి అంతస్థులో ఈ వార్డును ఏర్పాటుచేశారు. కేజీహెచ్‌ జనరల్‌ మెడిసిన్‌, అత్యవసర విభాగానికి వచ్చే వడదెబ్బ బాధితులకు ప్రత్యేక వార్డులో వైద్యం అందిస్తారు. గడిచిన కొద్దిరోజులుగా వాతావరణం మారిందని, ఎండ తీవ్రత పెరిగి ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్న ముందస్తు హెచ్చరికలతో హీట్‌ స్ర్టోక్‌ వార్డు ఏర్పాటుచేసినట్టు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివానంద వెల్లడించారు. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువగా లిక్విడ్‌ ఆహారాన్ని తీసుకోవాలని జనరల్‌ మెడిసిన్‌ డాక్టర్‌ నవీన్‌ సూచించారు. ఆరుబయట పనిచేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీలైనంత వరకూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ పనికి విశ్రాంతి ఇవ్వాలన్నారు. ఆ సమయంలో నీడ ప్రాంతాల్లో ఉండే పనులు చేయడం మంచిదన్నారు. శరీరం వేడిగా మారినా, తీవ్రమైన ఉక్కపోత వేధించినా, ఊపిరి సలపనట్టు అనిపించినా అప్రమత్తం కావాలని సూచించారు. వైద్యుల వద్దకు వెళ్లి వారి సూచనల మేరకు చికిత్స పొందాలన్నారు.

Updated Date - May 04 , 2025 | 12:48 AM