సిగినాపల్లి రంగురాళ్ల క్వారీపై ప్రత్యేక నిఘా
ABN , Publish Date - Dec 20 , 2025 | 10:25 PM
పెదవలస అటవీ శాఖ రేంజ్ పరిధిలోని సిగినాపల్లి రంగురాళ్ల క్వారీపై ప్రత్యేక నిఘా పెట్టామని స్థానిక డివిజనల్ ఫారెస్టు అధికారి వైవీ నరసింహరావు తెలిపారు.
14 మంది వ్యాపారులు, కూలీలపై కేసులు
24గంటలు బేస్ క్యాంప్‌తో గస్తీ
కొన్నిచోట్ల తవ్విన గోతులు పూడ్చివేత
డివిజనల్ ఫారెస్టు అధికారి వైవీ నరసింహరావు
చింతపల్లి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పెదవలస అటవీ శాఖ రేంజ్ పరిధిలోని సిగినాపల్లి రంగురాళ్ల క్వారీపై ప్రత్యేక నిఘా పెట్టామని స్థానిక డివిజనల్ ఫారెస్టు అధికారి వైవీ నరసింహరావు తెలిపారు. శనివారం సిగినాపల్లి రంగురాళ్ల క్వారీలో కొన్ని చోట్ల తవ్విన గోతులను బేస్ క్యాంప్ సిబ్బందితో పూడ్చివేశారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో విలేకర్లతో మాట్లాడుతూ సిగినాపల్లి రంగురాళ్ల క్వారీలో వ్యాపారుల సహకారంతో పరిసర గ్రామాల ప్రజలు రెండు రోజుల క్రితం తవ్వకాలు నిర్వహించారన్నారు. సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. తవ్వకాలు నిర్వహించిన 14 మంది వ్యాపారులు, కూలీలపై అటవీ చట్టం 1967 ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు. మరో నలుగురు వ్యాపారులపై విచారణ జరుపుతున్నామని, తవ్వకాల్లో వ్యాపారుల పాత్ర ఉన్నట్టు గుర్తిస్తే కేసులు పెడతామన్నారు. క్వారీ వద్ద తవ్వకాలను కట్టడి చేసేందుకు రేంజ్ అధికారి పర్యవేక్షణలో సెక్షన్ అధికారి, గార్డుతోపాటు 10 మంది రక్షణ పర్యవేక్షకులను నియమించామని, 24 గంటల గస్తీ నిర్వహిస్తున్నారన్నారు. అలాగే బేస్ క్యాంప్‌ని సైతం సిగినాపల్లి రంగురాళ్ల క్వారీపై ఏర్పాటు చేశామన్నారు. సిగినాపల్లి క్వారీని పూర్తిగా నిషేధించబడిందన్నారు. క్వారీ ప్రాంతంలో గూడెంకొత్తవీధి తహశీల్దార్ ద్వారా 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. ఎవరైన క్వారీ పరిసరాల్లో సంచరిస్తే కేసులు పెడతామని, ఈ విషయాన్ని క్వారీ పరిసర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో చింతపల్లి డీఆర్‌వో వెంకటరాజు, ఎఫ్‌బీవో గోపి పాల్గొన్నారు.