సిగినాపల్లి రంగురాళ్ల క్వారీపై ప్రత్యేక నిఘా
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:53 PM
పెదవలస అటవీశాఖ రేంజ్ పరిధి సిగినాపల్లి రంగురాళ్ల క్వారీపై ప్రత్యేక నిఘా పెట్టామని స్థానిక డివిజనల్ ఫారెస్టు అధికారి(డీఎఫ్‌వో) వైవీ నరసింహారావు తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సిగినాపల్లి క్వారీలో వ్యాపారులు తవ్వకాలకు ప్రయత్నిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో అటవీశాఖ ఉద్యోగులను అప్రమత్తం చేశామన్నారు.
తవ్వకాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు
వ్యాపారులపై బైండోవర్ కేసులు
పోలీసుల సహకారంతో నిత్యం గస్తీ
డీఎఫ్‌వో వైవీ నరసింహరావు
చింతపల్లి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పెదవలస అటవీశాఖ రేంజ్ పరిధి సిగినాపల్లి రంగురాళ్ల క్వారీపై ప్రత్యేక నిఘా పెట్టామని స్థానిక డివిజనల్ ఫారెస్టు అధికారి(డీఎఫ్‌వో) వైవీ నరసింహారావు తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సిగినాపల్లి క్వారీలో వ్యాపారులు తవ్వకాలకు ప్రయత్నిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో అటవీశాఖ ఉద్యోగులను అప్రమత్తం చేశామన్నారు. క్వారీ వద్ద రేంజ్ అధికారి, క్షేత్రస్థాయి ఉద్యోగులతో పాటు టాస్క్‌ఫోర్సు సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ క్వారీ సుమారు వెయ్యి మీటర్ల ఎత్తులో ఉంటుందన్నారు. దీంతో అటవీశాఖ ఉద్యోగులు దాడులు నిర్వహించడం కొంత ఇబ్బందికరంగా ఉందన్నారు. రోజూ 20 మంది అటవీశాఖ ఉద్యోగులు క్వారీ వద్ద విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. క్వారీ సమీప గ్రామాల ప్రజలకు తవ్వకాల వలన కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. గతంలో రంగురాళ్ల తవ్వకాలకు పాల్పడిన వ్యాపారులు, కూలీల కదలికలను పరిశీలిస్తున్నామని తెలిపారు. తవ్వకాలను ప్రోత్సహించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే రంగురాళ్ల వ్యాపారుల జాబితా తమ వద్ద ఉందన్నారు. రంగురాళ్ల వ్యాపారులను అటవీశాఖ కార్యాలయానికి పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. కొంత మంది వ్యాపారులపై బైండోవర్ కేసులు పెడుతున్నామన్నారు. క్వారీ వద్ద దాడులు నిర్వహించేందుకు పోలీసు, సీఆర్‌పీఎఫ్ ఫోర్సు కావాలని ఏఎస్పీ నవజ్యోతి మిశ్రాకు లేఖ పంపించామని తెలిపారు. శుక్రవారం నుంచి పోలీసులు, అటవీశాఖ ఉద్యోగులు సంయుక్తంగా క్వారీలో 24 గంటలూ గస్తీ నిర్వహిస్తారన్నారు. క్వారీ పరిసర ప్రాంతాలను పూర్తిగా నిషేధించామన్నారు. అలాగే గుర్రాళ్లగొంది, సత్యవరం, మేడూరు క్వారీల్లోనూ ప్రత్యేక సిబ్బందిని నియమించామన్నారు. రంగురాళ్ల క్వారీల్లో తవ్వకాలను నిర్వహిస్తే అటవీశాఖ ఉద్యోగులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన చెప్పారు.