రంగురాళ్ల క్వారీలపై ప్రత్యేక నిఘా
ABN , Publish Date - Oct 17 , 2025 | 10:56 PM
గిరిజన ప్రాంతంలోని రంగురాళ్ల క్వారీలపై ప్రత్యేక నిఘా పెట్టామని స్థానిక డివిజనల్ ఫారెస్టు అధికారి(డీఎఫ్‌వో) వైవీ నరసింహరావు అన్నారు.
డివిజనల్ ఫారెస్టు అధికారి వైవీ నరసింహరావు
క్వారీల వద్ద 144 సెక్షన్ అమలు
గతంలో తవ్విన గోతులు సిమెంట్ కాంక్రిట్‌తో మూసివేత
చింతపల్లి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలోని రంగురాళ్ల క్వారీలపై ప్రత్యేక నిఘా పెట్టామని స్థానిక డివిజనల్ ఫారెస్టు అధికారి(డీఎఫ్‌వో) వైవీ నరసింహరావు అన్నారు. శుక్రవారం మండలంలోని సత్యవరం రంగురాళ్ల క్వారీని పరిశీలించిన ఆయన గతంలో తవ్విన గొయ్యిని సిమెంట్ కాంక్రిట్‌తో మూయించి వేశారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో మాట్లాడుతూ చింతపల్లి డివిజన్ పరిధిలోని రంగురాళ్ల క్వారీల్లో ఎక్కడా తవ్వకాలు జరగకుండా ఉద్యోగులను అప్రమత్తం చేశామన్నారు. ప్రధానంగా సత్యవరం, మేడూరు, గుర్రాళ్లగొంది, సిగినాపల్లి, దొడ్డికొండ క్వారీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. బేస్ క్యాంప్, టాస్క్‌ఫోర్సు, స్ట్రైకింగ్ ఫోర్సు ఉద్యోగులు 24 గంటలు గస్తీ నిర్వహిస్తున్నారన్నారు. రంగురాళ్ల క్వారీల్లోని గొయ్యిలను గాజు పెంకులు, మట్టితో పూడ్చివేసినప్పటికి ఏదో ఒక సమయంలో కూలీలు, వ్యాపారులు తిరిగి తవ్వేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ క్వారీలను శాశ్వతంగా మూసివేయాలని సిమెంట్ కాంక్రిట్ వేస్తున్నామన్నారు. సిగినాపల్లి క్వారీలో సిమెంట్ కాంక్రిట్ వేశామన్నారు. ప్రస్తుతం సత్యవరం క్వారీలోనూ సిమెంట్ కాంక్రిట్‌తో మూయించి వేశామన్నారు. ఇతర క్వారీల్లోనూ శని, ఆదివారాల్లో సిమెంట్ కాంక్రిట్ వేస్తామన్నారు. ప్రధానంగా సెలవు దినాలు, పండగలు సమయాల్లో వ్యాపారులు, కూలీలు క్వారీల వద్దకు వస్తున్నారన్నారు. దీపావళి వస్తుండడంతో తవ్వకాలకు నిర్వహించేందుకు వ్యాపారులు, కూలీలు ప్రయత్నిస్తారని భావించి ముందుగానే సిమెంట్ కాంక్రిట్ వేస్తున్నామన్నారు. ఇప్పటికే క్వారీల్లో తవ్వకాలకు ప్రయత్నించిన వ్యాపారులు, కూలీలపై బైండోవర్ కేసులు పెట్టామన్నారు. జీకేవీధి పోలీసులు సైతం కేసులు పెట్టారన్నారు. వ్యాపారులు, కూలీల కదలికలపై ఆరా తీస్తున్నామని, తవ్వకాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తే చర్యలు తప్పవన్నారు. క్వారీల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని, వాటి వద్ద ఎవరు సంచరించినా కేసులు పెడతామన్నారు. ఈకార్యక్రమంలో రేంజ్ అధికారి అప్పారావు, డీఆర్‌వో వెంకటరావు పాల్గొన్నారు.