స్త్రీ శక్తికి విశేష ఆదరణ
ABN , Publish Date - Oct 18 , 2025 | 01:06 AM
రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ప్రారంభించిన ‘స్త్రీ శక్తి’ పథకానికి రోజు రోజుకూ ఆదరణ పెరుగుతున్నది. దీంతో బస్సుల్లో ఓఆర్ అనూహ్యంగా పెరిగింది. ఆయా బస్సుల్లో మొత్తం ప్రయాణికుల్లో 70 శాతం మంది మహిళలే వుంటున్నారు. గతంతో పోలిస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయినట్టు అధికారులు చెబుతున్నారు. అనకాపల్లి, నర్సీపట్నం డిపోల్లో మొత్తం 161 బస్సుల్లో స్త్రీ శక్తి పథకం అమలవుతున్నది.
రెండు నెలల్లో 31.5 లక్షల మంది ఉచిత ప్రయాణం
రూ.11,32,82,000 జీరో టికెట్లు
కిక్కిరిసిపోతున్న బస్సులు
116 శాతానికి పెరిగిన ఓఆర్
అనకాపల్లి టౌన్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ప్రారంభించిన ‘స్త్రీ శక్తి’ పథకానికి రోజు రోజుకూ ఆదరణ పెరుగుతున్నది. దీంతో బస్సుల్లో ఓఆర్ అనూహ్యంగా పెరిగింది. ఆయా బస్సుల్లో మొత్తం ప్రయాణికుల్లో 70 శాతం మంది మహిళలే వుంటున్నారు. గతంతో పోలిస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయినట్టు అధికారులు చెబుతున్నారు. అనకాపల్లి, నర్సీపట్నం డిపోల్లో మొత్తం 161 బస్సుల్లో స్త్రీ శక్తి పథకం అమలవుతున్నది. ఈ రెండు డిపోల నుంచి నడుస్తున్న పల్లె వెలుగు, అలా్ట్ర పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రెండు నెలల వ్యవధిలో 31 లక్షల 50 వేల 151 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. వీరిలో 19 లక్షల 74 వేల 53 మంది అనకాపల్లి డిపో నుంచి 89 బస్సుల్లో, 11 లక్షల 71 వేల 98 మంది నర్సీపట్నం డిపో నుంచి 72 బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. తద్వారా ఆర్టీసీకి రూ.11,32,82,000 ప్రభుత్వ నుంచి రీయింబర్స్ అవుతుంది. ఉచిత ప్రయాణానికి అనుమతించిన అన్ని బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. స్ర్తీశక్తి పథకం అమలుకు ముందు ఓఆర్ 70 శాతం ఉండగా, పథకం అమలులోకి వచ్చిన తరువాత 116 శాతానికి పెరిగిందని డీపీటీవో వి.ప్రవీణ చెబుతున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల నుంచి మహిళలు పట్టణాలకు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సుల కోసం వేచి ఉండకుండా అందుబాటులో వున్న ఆటోలు, మ్యాక్సీ క్యాబ్‌లు వంటి ప్రైవేటు వాహనాలను ఎక్కేవారు. ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చిన తరువాత బస్సుల కోసం ఎంతసేపైనా వేచివుంటున్నారని ఆర్టీసీ సిబ్బంది అంటున్నారు. స్ర్తీ శక్తి పథకాన్ని మహిళలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు.