జూ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
ABN , Publish Date - Jun 28 , 2025 | 01:07 AM
విశాఖపట్నం జంతు ప్రదర్శనశాల (జూ)ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
సింగపూర్ జూను నిర్వహిస్తున్న మాండై వైల్ట్ లైఫ్ ప్రతినిధులతో మాస్టర్ ప్లాన్ తయారీ
కేంద్రం ఆమోదిస్తే రూ.75 కోట్ల నిధులు
పదేళ్లలో పర్యాటకులు కోటికి చేరేలా ప్రయత్నం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం జంతు ప్రదర్శనశాల (జూ)ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్న సింగపూర్ జూ తరహాలో విశాఖ జూను అభివృద్ధి చేయాలనేది ప్రజా ప్రతినిధుల ఆలోచన. విశాఖపట్నం జూ 625 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అందులో 300 ఎకరాలు కొండ. మిగిలిన 325 ఎకరాల్లో జంతువులను సంరక్షిస్తున్నారు. దీనికి ఎదురుగా కంబాలకొండ అభయారణ్యం ఉంది. ఈ రెండింటినీ కలిపి అభివృద్ధి చేయనున్నారు.
విశాఖ జూలో వంద రకాల జంతువులు వేయి వరకూ ఉన్నాయి. ప్రస్తుతం అధికారులు జంతు సంతతిని సంరక్షించడంతో పాటు వాటి సంఖ్య పెంచడంపైనా దృష్టిపెట్టారు. వైల్డ్ డాగ్‌లను ప్రభుత్వం అంతరించిపోతున్న జాతిగా గుర్తించింది. వాటిని ఇక్కడ ప్రత్యేకంగా సంరక్షిస్తూ కొత్తగా జన్మించిన వాటిని ఇతర జూలకు పంపుతున్నారు. ఆ జాతికే చెందినవే 40 వరకు ఉండడం గమనార్హం.
పర్యాటక అభివృద్ధి కోసం
సింగపూర్ జూ కూడా విస్తీర్ణంలో దాదాపుగా విశాఖపట్నం జూలానే ఉంటుంది. కాకపోతే అక్కడ జంతువుల సంఖ్యతో పాటు సందర్శించే వారి సంఖ్య కూడా అధికమే. ఏటా 5 కోట్ల మంది ఆ జూను సందర్శిస్తుంటే...విశాఖ జూని సందర్శించే వారి సంఖ్య ఎనిమిది లక్షలకే పరిమితంగా ఉంది. సింగపూర్ ప్రభుత్వానికి జూ ద్వారా ఏడాదికి రూ.7 వేల కోట్ల ఆదాయం వస్తోంది. సింగపూర్ ప్రజలతో పాటు ఇతర దేశాలవారు చూసిన జూనే మళ్లీ మళ్లీ చూడడానికి వెళుతుంటారు. జంతువులతో అనుబంధం పెంచుకుంటున్నారు. ఇక్కడ కూడా లాంటి వాతావరణమే తీసుకురావాలని విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సింగపూర్ జూను నిర్వహిస్తున్న మాండై వైల్ట్ లైఫ్ ప్రతినిధులను ఇటీవల విశాఖపట్నం రప్పించి జూ మొత్తం చూపించారు. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేయడానికి వారితో మాస్టర్ ప్లాన్ తయారుచేయించారు. పర్యాటకులకు మరిన్ని వసతులు, సదుపాయాలు, వారిని ఆకర్షించే అంశాలు అందులో ఉండేలా సూచనలు చేశారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. అక్కడి నుంచి కేంద్రానికి సమర్పిస్తారు. ఆమోదం లభిస్తే నిధులు వస్తాయి. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా అభివృద్ది చేస్తారు.
రూ.75 కోట్లతో మొదటి దశ పనులు
శ్రీభరత్, ఎంపీ, విశాఖపట్నం
సింగపూర్ బృందం తయారుచేసిన మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం లభిస్తే కేంద్రం నుంచి రూ.75 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు నిధులు వస్తాయి. వాటితో మొదటి దశ పనులు చేపట్టి రాబోయే పదేళ్లలో సందర్శకుల సంఖ్యను కోటి వరకు పెంచాలని యోచిస్తున్నాము. గతంలో సందర్శకులకు టాయ్ ట్రైన్ ఉండేది. నిర్వహణ లేక మూలపడింది. దానిని పునరుద్ధరించడంతో పాటు ఇంకా అనేక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.