పాఠశాలలకు ప్రత్యేకాధికారులు
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:16 AM
వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా పాఠశాల విద్యా శాఖ 100 రోజుల ప్రణాళిక రూపొందించింది.
పదో తరగతి పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధతపై పర్యవేక్షణ కోసం నియామకం
ఉపాధ్యాయుల అసంతృప్తి
విశాఖపట్నం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి):
వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా పాఠశాల విద్యా శాఖ 100 రోజుల ప్రణాళిక రూపొందించింది. అయితే విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి, వారిని పరీక్షలకు సన్నద్ధం చేయడానికి ప్రభుత్వ పరిధిలోని 108 ఉన్నత పాఠశాలలకు ప్రభుత్వ శాఖల అధికారులను ప్రత్యేకాధికారులుగా జిల్లా యంత్రాంగం నియమించింది. ప్రత్యేకాధికారులు వారానికి రెండు రోజులు తనిఖీ చేయాల్సి ఉంటుంది.
పదో తరగతి సిలబస్ ఇప్పటికే పూర్తిచేసిన ఉపాధ్యాయులు, ప్రస్తుతం రివిజన్ చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. తరగతిలో విద్యార్థులకు నిర్వహిస్తున్న పరీక్షలలో వచ్చిన మార్కుల ఆధారంగా రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్‌గా విభజించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకాధికారులు తమకు కేటాయించిన ఉన్నత పాఠశాలలను తనిఖీచేసి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతున్నారు. విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలపై అవగాహన ఎంత ఉంది?, పబ్లిక్ పరీక్షలకు వీలుగా సన్నద్ధమవుతున్నారా?...అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థుల సామర్థ్యం, బోధన వంటి అంశాలపై ఉపాధ్యాయులతో ప్రత్యేకాధికారులు మాట్లాడుతున్నారు. అయితే పాఠశాలలకు ప్రత్యేకాధికారుల నియామయంపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మెరుగైన ఫలితాల కోసం ప్రతి టీచర్ తన సామర్థ్యం మేరకు బోధన చేస్తూ విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారంటున్నారు. ప్రత్యేకాధికారులను నియమించి తమను అవమానించారంటూ మండిపడుతున్నారు. మిగిలిన శాఖల్లో పని సామర్థ్యం తెలుసుకునేందుకు టీచర్లకు బాధ్యతలు అప్పగిస్తే వారంతా ఊరుకుంటారా?...అని ప్రశ్నిస్తున్నారు. పదో తరగతి పరీక్షల పేరుతో తమపై ప్రత్యేకాధికారుల పెత్తనం ఏమిటని వ్యాఖ్యానిస్తున్నారు.