Share News

మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - Nov 26 , 2025 | 12:01 AM

గిరిజన ప్రాంతంలో మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా మలేరియా అధికారి(డీఎంవో) ఎం.తులసి తెలిపారు.

మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు
వేలంజువ్వి గ్రామంలో ఆశ కార్యకర్త వద్ద అందుబాటులో ఉన్న మందులను పరిశీలిస్తున్న డీఎంవో తులసి

రెండు విడతల్లో దోమల మందు పిచికారీ పూర్తి

జ్వరబాధితులు విధిగా రక్త పరీక్షలు చేయించుకోవాలి

జిల్లా మలేరియా అధికారి తులసి

చింతపల్లి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా మలేరియా అధికారి(డీఎంవో) ఎం.తులసి తెలిపారు. మంగళవారం మండలంలోని శివారు ఏవోబీ సరిహద్దులో ఉన్న కోరుకొండ, లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. వేలంజువ్వి గ్రామాన్ని సందర్శించి దోమల మందు పిచికారీని పరిశీలించారు. ఆశ కార్యకర్తతో జ్వరబాధితుడికి రక్త పరీక్ష చేయించారు. ఈ సందర్భంగా డీఎంవో మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో మలేరియా అదుపులో ఉందన్నారు. మలేరియా నివారణపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారన్నారు. ప్రధానంగా ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో లార్వా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని, గిరిజనులు రాత్రివేళ దోమ తెరలను వినియోగించాలన్నారు. అలాగే గత ఏడాది రెండు కంటే ఎక్కువగా మలేరియా కేసులు నమోదైన గిరిజన గ్రామాల్లో మొదటి విడత, రెండో విడత దోమల మందు పిచికారీ పూర్తి చేశామన్నారు. జ్వరబాధితులు కచ్చితంగా రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. గ్రామాల్లో జ్వర బాధితులకు రక్తపూతలు సేకరించి పీహెచ్‌సీ ల్యాబ్‌లో పరీక్షలు చేయాలన్నారు. మలేరియా వ్యాధి నిర్ధారణ జరిగితే సక్రమంగా మందులు వాడాలని సూచించారు. గిరిజనులు మలేరియా జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని, జ్వరాల బారిన పడిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు. నాటువైద్యం, పసర మందులకు దూరంగా ఉండాలన్నారు. లోతుగెడ్డ పీహెచ్‌సీలో ల్యాబ్‌ని తనిఖీ చేసిన ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. పీహెచ్‌సీ పరిధిలో రక్తపరీక్షలు అధికంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్‌ యూనిట్‌ అధికారి బుక్కా చిట్టిబాబు, ఎంటీఎస్‌ యుగంధర్‌, ఎల్‌టీ బాబూరావు, ఎంపీహెచ్‌ఈవో కన్నబాబు, హెచ్‌ఏ వీర్రాజు పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2025 | 12:01 AM