ఉద్యాన వన పంటల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:20 PM
అధిక సంఖ్యలో గిరిజన రైతులుండే జిల్లాలో ఉద్యాన వన పంటల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు. అమరావతిలో సోమవారం సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన నాలుగో విడత జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు.
కలెక్టర్ల సదస్సులో ఏఎస్ దినేశ్‌కుమార్
పండ్ల తోటల ద్వారా గిరి రైతుల ఆదాయాన్ని పెంచుతామని వెల్లడి
పాడేరు, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): అధిక సంఖ్యలో గిరిజన రైతులుండే జిల్లాలో ఉద్యాన వన పంటల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు. అమరావతిలో సోమవారం సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన నాలుగో విడత జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. పండ్ల తోటల పెంపకం ద్వారా గిరిజన రైతుల ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో ఉన్నామని, అందుకు గాను 6,111 ఎకరాల్లో ఉద్యాన వన పంటల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో అధిక శాతం గిరిజనులు వ్యవసాయ, ఉద్యాన వనాల ఆధారంగా జీవనం సాగిస్తున్నారని, ఆ క్రమంలో వాటిని అభివృద్ధి చేయడం ద్వారా 15 శాతం వృద్ధిరేటు లక్ష్యాన్ని చేరేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అలాగే ఉపాధి హామీ పథకంలో పంట కుంటల నిర్మాణం, ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ, మైక్రో ఇరిగేషన్ విస్తరణకు అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. అందుకు గాను సుమారుగా రూ.120 కోట్లు అవసరమని గుర్తించామన్నారు. గిరిజన రైతుల పంట భూములను పరీక్షించి భూసార ఆరోగ్య కార్డులను అందించాలని భావిస్తున్నామని, చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేపట్టి సాగునీటి వసతులను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ వివరించారు. అలాగే వ్యవసాయ, ఉద్యానవన పంటల గురించి ఆయన వెల్లడించారు.