కార్వాన్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:47 PM
జిల్లాలో కార్వాన్ టూరిజం అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. కార్వాన్ టూరిజంపై కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశం/వర్చువల్‌లో ఆయన మాట్లాడారు.
అధికారులకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశం
పాడేరు, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కార్వాన్ టూరిజం అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. కార్వాన్ టూరిజంపై కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశం/వర్చువల్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పాడేరు డివిజన్ పరిధిలో అరకులోయ మండలం మాడగడ, ముంచంగిపుట్టు మండలం సుజనకోట, చింతపల్లి మండలం లంబసింగిలో మొత్తం మూడు, రంపచోడవరం డివిజన్ పరిధిలో మారేడుమిల్లి, రంపచోడవరం మండలం గాంధీనగరంలో రెండు చోట్ల కార్వాన్ టూరిజం పార్కుల ఏర్పాటుకు స్థలాలను గుర్తించామన్నారు. గుర్తించిన ఆయా స్థలాలకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించాలని, ప్రైవేటు స్థలాలు కాకుండా ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేస్తే బాగుంటుందన్నారు. జిల్లాలో పర్యాటకాభివృద్థిలో భాగంగా కార్వాన్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
27న హోమ్ స్టే టూరిజం పోస్టర్‌ను ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హోమ్ స్టే టూరిజం పోస్టర్‌ను ఆవిష్కరిస్తారని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు. జిల్లాలో హోమ్ స్టేకు ఇప్పటికే 147 ఇళ్లను ఎంపిక చేశామన్నారు. అలాగే హోమ్ స్టేలపై నిర్వాహకులకు అవసరమైన శిక్షణ అందిస్తున్నామన్నారు. ప్రతి మండలంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌లను ఎంపిక చేసి వారికి దీనిపై శిక్షణ ఇస్తామన్నారు. జిల్లాలో హోమ్ స్టే, కార్వాన్ టూరిజం సామర్థ్యం పెంపునకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. అందుకు అనుగుణంగా ఆయా శాఖల అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు టి.శ్రీపూజ, స్మరణ్‌రాజ్, అపూర్వభరత్, రంపచోడవరం సబ్‌కలెక్టర్ శుభం నక్వాల్, సీనియర్ పాజ్రెక్టు కన్సల్టెంట్ నిషిత, ఆర్కిటెక్చర్ కన్సల్టెంట్ కలేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, గ్రామ సచివాలయాల నోడల్ అధికారి పీఎస్.కుమార్, అరకులోయ, చింతపల్లి, ముంచంగిపుట్టు, రంపచోడవరం, మారేడుమిల్లి మండలాలకు చెందిన తహశీల్దార్లు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.