ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:38 PM
ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశం
పీజీఆర్‌ఎస్‌లో 151 వినతుల స్వీకరణ
పాడేరు, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీకోసం)లో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. పీజీఆర్‌ఎస్‌లో సమర్పించిన వినతుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. సమస్యలపై తక్షణమే స్పందించడం, విచారణ చేపట్టడడం ద్వారా పరిష్కారానికి నోచుకుంటాయన్నారు. ఇందుకు అధికారుల చొరవే ముఖ్యమన్నారు. ఆ దిశగా అన్ని శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ దినేశ్‌కుమార్ పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్, ఆర్డీవో ఎంవీఎస్.లోకేశ్వరరావులతో కలిసి ప్రజల నుంచి 151 వినతులను స్వీకరించారు. వై.రామవరం మండలం బొడ్డగంటి పంచాయతీ బచ్చులూరు గ్రామానికి సబ్ సెంటర్, అంగన్‌వాడీ, పాఠశాలకు భవనాలను నిర్మించాలని ఎంపీటీసీ సభ్యుడు వి.ప్రసాద్, సర్పంచ్ ఎం.తెల్లనయ్యరెడ్డి కోరగా, అడ్డతీగల మండలం తుంగమడుగుల పంచచాయతీ దుప్పలపాలెంలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టైఫాయిడ్, ఇతర పరీక్షల పరికరాలు, మందులు లేవని గ్రామస్థులు తెలిపారు. అలాగే ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయతీ పెద్దాపుట్టులోని గిరిజనులకు ఇళ్లు మంజూరు చేయాలని సర్పంచ్ వి.రత్న కోరగా, హుకుంపేట మండలం కామయ్యపేట గ్రామానికి సామాజిక భవనాన్ని నిర్మించాలని వి.చిరంజీవి, కె.పెంటన్న, కె.చిట్టిబాబు, తదితరులు కోరారు. అలాగే పీఎం జన్‌మన్ ఇళ్ల లబ్ధిదారులకు అదనపుసాయం రూ.లక్ష మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించగా, పాడేరు, హుకుంపేట మండలాల్లో అనేక గ్రామాల్లోని అర్హులకు వృద్ధాప్య, దివ్యాంగుల పెన్షన్లు మంజూరు కాలేదని ఆదివాసీ మహాసభ అధ్యక్షుడు అప్పారావు తెలిపారు. జీకేవీధి మండలం దారకొండ పంచాయతీ రోలుగుంట గ్రామానికి మినీ అంగన్‌వాడీ కేంద్రాన్ని మంజూరు చేయాలని గిరిజన సమాఖ్య నేతలు రాధాకృష్ణ, నగేశ్ కోరారు.
1100 మీకోసం కాల్ సెంటర్ సేవలు సద్వినియోగం
మీకోసం కార్యక్రమంలో అర్జీదారులు దాఖలు చేసిన సమస్యల పరిష్కారానికి నోచుకోకుంటే 1100 నంబర్‌కు ఫోన్ చేసి సేవలు పొందాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ సూచించారు. అర్జీదారులు కాల్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో కె.పద్మలత, డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, డీఈవో పి.బ్రహ్మాజీరావు, రోడ్ల, భవనాల శాఖ ఈఈ బాలసుందరబాబు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమిళ, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్ , గ్రామ సచివాలయాల నోడల్ అధికారి పీఎస్.కుమార్, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, జాతీయ రహదారుల డిప్యూటీ తహశీల్దార్ వి. ధర్మరాజు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, జిల్లా ఖజానాధికారి ప్రసాద్‌బాబు, ఎస్‌టీవో కృపారావు, అధికారులు పాల్గొన్నారు.