అర్జీల పరిష్కారానికి ప్రత్యేక చొరవ
ABN , Publish Date - Aug 01 , 2025 | 10:46 PM
ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జాయింట్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ ఆదేశించారు.
అధికారులకు జేసీ అభిషేక్‌గౌడ ఆదేశం
మీకోసం కార్యక్రమంలో 81 వినతులు స్వీకరణ
పాడేరు, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జాయింట్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించినప్రజా సమస్యల పరిష్కార వేదిక( మీకోసం) కార్యక్రమంలో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలు సమర్పిస్తున్న అర్జీలను సంబంధిత శాఖాధికారులకు పంపిస్తామని, వాటిని పరిశీలించి పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. మీకోసంలో ఇచ్చిన అర్జీలు ఏ దశలో ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రజలు 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ఈసందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ కె.సాహిత్, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత 81 వినతులను స్వీకరించారు. హుకుంపేట మండలం మత్స్యపురం పంచాయతీ కేంద్రానికి చెందిన కొర్రా బొంజుబాబు, పాంగి చిరంజీవి బుదరమామిడి నుంచి సెంబి గ్రామానికి రోడ్డు నిర్మించాలని కోరారు. అలాగే కొయ్యూరు మండలం కొమ్మిక పంచాయతీ డేగలపాలెం గ్రామానికి వ్యవసాయ వినియోగానికి విద్యుత్ లైన్ వేయాలని గ్రామస్థులు డి.సత్యనారాయణ, డి.గురువులు, డి.రాంబాబు కోరగా, చింతపల్లికి చెందిన శ్రీనివాసరావు, తదితరులు రోడ్డు విస్తరణలో తమ దుకాణాలు తొలగించారని, ప్రత్యామ్నాయంగా వాటిని మరోచోట ఏర్పాటుకు అనుమతి కావాలని కోరారు. అలాగే కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీలో బోడిదేవులపల్లి నుంచి పోకలపాలెం వరకు తారురోడ్డు నిర్మించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంవీఎస్.లోకేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్, జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజిరావు, ల్యాండ్ సర్వే విభాగం ఏడీ దేవేంధ్రుడు, గ్రామ సచివాలయాల నోడల్ అధికారి పీఎస్.కుమార్, జాతీయ రహదారుల డిప్యూటీ తహశీల్దార్ ధర్మరాజు, జిల్లా ఖజానాధికారి ప్రసాద్‌బాబు, ఎస్‌టీవో కృపారావు, తదితరులు పాల్గొన్నారు.