Share News

మూడు పంచాయతీలకు స్పెషల్‌ గ్రేడ్‌

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:48 AM

గ్రామ పంచాయతీ వ్యవస్థలో కొన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మూడు పంచాయతీలకు స్పెషల్‌ గ్రేడ్‌

గంభీరం, వేములవలస, దాకమర్రిలకు ప్రత్యేక సిబ్బంది

మరో 15 పంచాయతీలకు గ్రేడ్‌-1 హోదా

త్వరలో అధికారికంగా ఉత్తర్వులు

విశాఖపట్నం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి):

గ్రామ పంచాయతీ వ్యవస్థలో కొన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయం, జనాభాను పరిగణనలోకి తీసుకుని గ్రేడ్లు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆమోదించింది. ఈ మేరకు జిల్లాలోని గంభీరం, వేములవలస, దాకమర్రి పంచాయతీలకు స్పెషల్‌ గ్రేడ్‌ హోదా కల్పిస్తారు. ఏడాదికి రూ.కోటి ఆదాయం దాటిన పంచాయతీలకు స్పెషల్‌ గ్రేడ్‌ హోదా లభించనున్నది.

జిల్లాలో మొత్తం 79 గ్రామ పంచాయతీలు ఉండగా జాతీయ రహదారి, నగరానికి ఆనుకుని ఉన్న గ్రామ పంచాయతీలకు ఆదాయం ఎక్కువగా ఉంది. వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, సంతలు, భూముల క్రయ విక్రయాల (రిజిస్ర్టేషన్‌ ఫీజులో కొంత పంచాయతీలకు ఇవ్వాలి) ద్వారా మంచి ఆదాయం వస్తోంది. గంభీరం పంచాయతీ పరిధిలో చిన్న పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, భూముల విక్రయాలు ఉండడంతో ఏడాదికి రూ.1.5 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోంది. ఆనందపురం మండలం వేములవలస పంచాయతీకి సంత ఆదాయం, దుకాణాలతో పాటు రిజిస్ట్రేషన్లు వల్ల రూ.1.2 కోట్ల ఆదాయం వస్తోంది. దాకమర్రి పంచాయతీలో ఇటీవల భూముల క్రయవిక్రయాలు పెరగడంతో ఆదాయం రూ.కోటి దాటింది. దీంతో ఈ మూడు పంచాయతీలకు స్పెషల్‌ గ్రేడ్‌ హోదా లభించనున్నది. ఈ హోదా లభించిన పంచాయతీలకు కార్యదర్శిగా డిప్యూటీ మండల అభివృద్ధి అధికారిని నియమించడంతో పాటు సిబ్బందిని కేటాయిస్తారు. అలాగే ఆర్థిక సంఘం నిధులు ఎక్కువగా రానున్నాయి. ఏటా రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఆదాయం వచ్చే పంచాయతీలకు గ్రేడ్‌-1, రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల ఆదాయం వచ్చే పంచాయతీలకు గ్రేడ్‌-2 హోదా కల్పిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లాలో సుమారు 15 గ్రామ పంచాయతీలకు గ్రేడ్‌-1 హోదా లభించే అవకాశం ఉంది. పంచాయతీలకు గ్రేడ్ల కేటాయింపునకు సంబంధించి త్వరలో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Updated Date - Oct 06 , 2025 | 12:48 AM