పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Dec 08 , 2025 | 01:17 AM
నగరంలో పారిశుధ్య నిర్వహణపై ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ప్రత్యేక దృష్టి సారించారు.
జీవీఎంసీ కమిషనర్ అర్ధరాత్రి తనిఖీలు
నగరంలోని పలుప్రాంతాల్లో ఆకస్మిక సందర్శన
సిబ్బంది పేర్లు, హాజరు పట్టికపై ఆరా
విధులకు 40 మంది గైర్హాజరైనట్టు నిర్ధారణ
శానిటరీ సూపర్‌వైజర్ పనితీరుపై ఆగ్రహం
విశాఖపట్నం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి):
నగరంలో పారిశుధ్య నిర్వహణపై ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ప్రత్యేక దృష్టి సారించారు. పారిశుధ్య నిర్వహణకు ప్రస్తుత సిబ్బంది సరిపోవడంలేదని, తాత్కాలిక ప్రాతిపదికన అదనపు సిబ్బందిని నియమిస్తున్నట్టు అధికారులు చెబుతుండడంపై ఇటీవల స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు అనుమానాలు వ్యక్తంచేశారు. తాను బీచ్‌రోడ్డులో తనిఖీ చేయడానికి వెళితే హాజరు కంటే తక్కువ సిబ్బంది విధుల్లో ఉన ్నట్టు తేలిందని మేయర్ పీలా శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేయడంతో కమిషనర్ రంగంలోకి దిగారు. పారిశుధ్య నిర్వహణ తీరును తెలుసుకునేందుకు శనివారం అర్ధరాత్రి నగరంలోని పలు ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోపణల్లోని వాస్తవాలను నిగ్గుతేల్చాలని భావించినట్టు తెలిసింది.
జీవీఎంసీ నిధులు భారీగా ఖర్చవుతున్నా ఫలితం కనిపించడం లేదని మేయర్‌తో సహా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయడం, అధికారుల పర్యవేక్షణ లోపానికి తోడు కాంట్రాక్టర్‌తో పారిశుధ్య విభాగం అధికారులు, సిబ్బంది కుమ్మక్కై కార్మికుల హాజరులో అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిషనర్ నగరంలోని డైమండ్‌పార్క్, ఆర్టీసీ కాంప్లెక్స్, సిరిపురం జంక్షన్, సత్యం జంక్షన్, సీతమ్మధార తదితర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణను తనిఖీ చేశారు. జోన్-3 పరిధిలో 375 మంది రాత్రి పారిశుధ్య నిర్వహణ పనులు నిర్వహిస్తుండడంతో వారి హాజరుపట్టికతోపాటు ఎవరెక్కడ పనిచేస్తున్నారనే సమాచారం ఆధారంగా పనుల్లో ఉన్న కార్మికులను పరిశీలించారు. కార్మికుల వద్దకు వెళ్లి వారిపేర్లను తెలుసుకుని హాజరుపట్టికలో ఉన్న వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా 12 శాతం (సుమారు 40 మంది) విధులకు గైర్హాజరైనట్టు కమిషనర్ గుర్తించారు. దీనిపై అధికారులతో మాట్లాడి కారణాలు తెలుసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది.
కార్మికులతో మాటామంతీ
ఈ సందర్భంగా కమిషనర్ పారిశుధ్య కార్మికుల సమస్యలను అడిగితెలుసుకున్నారు. రాత్రి సమయంలో పారిశుధ్య నిర్వహణపనులు, నగర పరిశుభ్రత, కాలుష్య నియంత్రణ, ప్రజల ఆరోగ్యం, నగర సుందరీకరణ వంటి కీలకమైన బాధ్యతలను కార్మికులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. అందరూ బాధ్యతతో పనిచేసి నగరానికి ప్రత్యేకగుర్తింపు తీసుకురావాలని కోరారు. వాణిజ్య ప్రాంతాల్లో చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ, సమయానికి వ్యర్థాలను తొలగించడం అత్యంత ముఖ్యమన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుకవైపు ఉన్న ప్యాకేజీ-15 ఫుట్‌పాత్‌ను ఆక్రమించి ఏర్పాటుచేసిన దుకాణాన్ని తొలగించాలని, లేదంటే ప్రతీ దుకాణానికి రూ.పదివేలు జరిమానా విధించాలని పారిశుధ్య నిర్వహణ సూపర్‌వైజర్‌ను ఆదేశించారు. రాత్రిపూట పారిశుధ్య నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించాల్సిన శానిటరీ సూపర్‌వైజర్-2 ఫీల్డ్‌లో లేకపోవడంతో అతడి పనితీరుపై ఫోన్‌లో ప్రజారోగ్యవిభాగం అధికారుల నుంచి సమాచారం సేకరించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.