గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Aug 18 , 2025 | 11:38 PM
గంజాయి నిర్మూలనపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ ఆదేశించారు.
ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఎంజే అభిషేక్ గౌడ
పాడేరు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): గంజాయి నిర్మూలనపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో అటవీ, వ్యవసాయ, ఉద్యానవన, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, చిన్ననీటి పారుదల శాఖలకు చెందిన అధికారులతో సోమవారం గంజాయి నిర్మూలనపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా మారుమూల అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేయకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అటవీ ప్రాంతాల్లో, అటవీ హక్కు పత్రాలు పంపిణీ చేసిన భూముల్లో గంజాయి సాగు చేయకుండా ఎటువంటి పర్యవేక్షణ చేస్తున్నారని అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెక్ పోస్టుల వద్ద పకడ్బందీగా తనిఖీ చేయాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో జరిగే గ్రామైక్య సంఘాల సమావేశాల్లో సైతం గంజాయి నిర్మూలనపై చర్చ జరగాలన్నారు. గంజాయి సాగును విడిచిపెట్టిన రైతులకు ప్రత్యామ్నాయ పంటలను అందించాలన్నారు. మండల స్థాయి సమావేశాల్లో వ్యవసాయ, ఉద్యానవనాధికారులు పాల్గొని గంజాయి సాగు నియంత్రణ ప్రక్రియపై చర్చించాలని సూచించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో పంపిణీ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ వి.మురళి, డీఎస్‌పీ షెహబాజ్ అహ్మద్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, చిన్ననీటిపారుదల శాఖ డీఈఈ నాగేశ్వరరావు, వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.