Share News

గంజాయి సాగు నిర్మూలనపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Aug 26 , 2025 | 11:19 PM

ఆంధ్ర, ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించామని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జట్టి చెప్పారు. మంగళవారం ఆయన స్థానిక పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.

గంజాయి సాగు నిర్మూలనపై ప్రత్యేక దృష్టి
కశింకోట పోలీసు స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతున్న డీఐజీ గోపీనాథ్‌ జట్టి. పక్కన ఎస్పీ తుహిన్‌ సిన్హా, డీఎస్పీ శ్రావణి

రవాణా జరిగే మార్గాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జట్టి

కశింకోట, అనకాపల్లిల్లో పోలీసు స్టేషన్ల తనిఖీ

కశింకోట, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర, ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించామని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జట్టి చెప్పారు. మంగళవారం ఆయన స్థానిక పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గంజాయి రవాణా జరిగే రూట్లను గుర్తించి, ఆయా మార్గాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రేంజ్‌ పరిధిలో 300 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని గంజాయి రవాణాను అరికడుతున్నామని తెలిపారు. గంజాయి రవాణా చేసేవారిలో 40 శాతం మంది ఏపీకి చెందిన వారుకాగా, మిగిలిన 60 శాతం మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా దర్యాప్తులో గుర్తించినట్టు డీఐజీ చెప్పారు. జాతీయ రహదారిపై ప్రమాదాలను మరింత తగ్గించడానికి ఎన్‌హెచ్‌ఐఏ ఇంజనీరింగ్‌ అధికారులతో మాట్లాడి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్న జంక్షన్‌ల వద్ద సిగ్నల్‌ పాయింట్లు ఏర్పాటు చేయాలని ఆయా పోలీసు స్టేషన్ల అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. డీఐజీ వెంట ఎస్పీ తుహిన్‌ సిన్హా, అనకాపల్లి డిఎస్పీ ఎం.శ్రావణి, స్థానిక సీఐ అల్లు స్వామినాయుడు, అనకాపల్లి రూరల్‌ సీఐ అశోక్‌కుమార్‌, పట్టణ సీఐ టీవీ విజయ్‌కుమార్‌, ఎస్‌ఐలు లక్ష్మణరావు, మనోజ్‌కుమార్‌, సంతోశ్‌ తదితరులు వున్నారు..

పోలీస్‌స్టేషన్‌లను తనిఖీ చేసిన డీఐజీ

అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌, మహిళా పోలీస్‌స్టేషన్‌లను మంగళవారం విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జట్టి తనిఖీ చేశారు. ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన స్మార్ట్‌ మేనేజ్‌మెంట్‌ కంట్రోల్‌ రూంను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. మహిళా పోలీస్‌స్టేషన్‌ ద్వారా మహిళల భద్రతా చర్యలను మరింత పటిష్ఠం చేయాలని అధికారులకు సూచించారు. ఈవ్‌ టీజింగ్‌, యాంటీ ర్యాగింగ్‌, పోక్సో చట్టాలపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డీఐజీ వెంట అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి, సీఐలు టీవీ విజయ్‌కుమార్‌, ఎం.వెంకటనారాయణ, అశోక్‌కుమార్‌, స్వామినాయుడు, ఎస్‌ఐ శేఖరం ఉన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 11:19 PM