పది పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాలు
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:34 PM
పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్(పరీక్షలు) ఆర్.శశికుమార్ అన్నారు.
ఉత్తీర్ణత పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి
మాస్ కాపీయింగ్‌కి అవకాశం ఉండదు
జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్(పరీక్షలు) శశికుమార్
చింతపల్లి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్(పరీక్షలు) ఆర్.శశికుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని జిల్లా పరిషత్, గిరిజన సంక్షేమ శాఖ బాలుర-1, 2, బాలికల ఆశ్రమ పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శశికుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గత ఏడాది 71 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య ఆధారంగా నాలుగైదు పరీక్ష కేంద్రాలు పెరిగే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించాలని విద్యాశాఖ మంత్రి, కమిషనర్‌ల నుంచి ఉత్తర్వులు వచ్చాయన్నారు. ఈమేరకు ఎంఈవోలు ప్రతిపాదించిన పరీక్ష కేంద్రాలను స్వయంగా సందర్శించి, అందుబాటులోనున్న సదుపాయాలను పరిశీలిస్తున్నామన్నారు. పూర్తి స్థాయిలో సదుపాయాలుంటేనే పరీక్ష కేంద్రానికి అనుమతులు ఇస్తామన్నారు. విద్యార్థులందరూ బెంచీలుపైనే పరీక్షలు రాస్తారన్నారు. తరగతి గదిలో ఫ్యాన్, విద్యుత్ సదుపాయం ఉండేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. తాగునీరు, రన్నింగ్ వాటర్ కలిగిన మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరీక్ష కేంద్రంలో ప్రాథమిక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కాపీయింగ్, మాల్‌ప్రాక్టీస్‌కి అవకాశం ఉండదన్నారు. ఎక్కడైన కాపీయింగ్‌ని ప్రోత్సహిస్తే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ఏడాది జిల్లాలో జి.మాడుగుల, చింతపల్లి మండలాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిందన్నారు. ప్రతి మండలంలోనూ ఉత్తీర్ణత శాతం పెంచాలని ఉపాధ్యాయులను ఆదేశించామన్నారు. గతంలో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీలు ఉన్నాయని, ఈ ఏడాది మెగా డీఎస్సీ ద్వారా పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయడం జరిగిందన్నారు. వివిధ పాఠ్యాంశాల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఈవో పీబీవీవీవీ ప్రసాద్, ఎంఈవో-2 గెమ్మెలి బోడంనాయుడు పాల్గొన్నారు.