Share News

సెల్లార్‌లపై స్పెషల్‌ డ్రైవ్‌

ABN , Publish Date - Dec 22 , 2025 | 01:27 AM

నగరంలో రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్‌ లంగ్స్‌’కు ప్రజల నుంచి సానుకూలస్పందన రావడంతో జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ మరో నిర్ణయం అమలుచేయాలని నిర్ణయించారు.

సెల్లార్‌లపై స్పెషల్‌ డ్రైవ్‌

ఆక్రమణలపై కమిషనర్‌ దృష్టి

ఇతర అవసరాలకు వాడుతుండడంతో రోడ్లపైనే వాహనాల పార్కింగ్‌

వాణిజ్య భవనాల్లో పార్కింగ్‌కు కేటాయించేలా చర్యలు

డాబాగార్డెన్స్‌, ద్వారకానగర్‌, జగదాంబ ప్రాంతాలు ఎంపిక

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

నగరంలో రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్‌ లంగ్స్‌’కు ప్రజల నుంచి సానుకూలస్పందన రావడంతో జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ మరో నిర్ణయం అమలుచేయాలని నిర్ణయించారు. వాణిజ్య ప్రాంతాల్లో వాహనాలను రోడ్లపైనే నిలిపివేయడంతో ట్రాఫిక్‌సమస్య నిత్యకృత్యంగా మారుతోంది. దీంతో సెల్లార్‌ల ఆక్రమణలపై చర్యలకు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నారు. వాణిజ్యభవనాల్లో సెల్లార్‌లను పార్కింగ్‌కు మాత్రమే వినియోగించేలా చూస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. త్వరలో దీనిని అమలుచేయాలని నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు.

నగరంలోని వాణిజ్య భవనాల్లో సెల్లార్‌ను విధిగా వాహనాల పార్కింగ్‌కు మాత్రమే వినియోగించాలి. కానీ దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. సెల్లార్‌లలో కూడా దుకాణాలు, గోడౌన్‌లు, కార్యాలయాలు, సంస్థల్లో పనిచేసే సిబ్బందికి రెస్ట్‌రూమ్‌లు ఏర్పాటుచేస్తున్నారు. దీంతో సెల్లార్‌లో పార్కింగ్‌కు అవకాశం లేక ఆయా భవనాల్లోని దుకాణాలు, కార్యాలయాలు, ఇతర పనులమీద వచ్చేవారు తమ వాహనాలను రోడ్డుపైనే నిలిపివేస్తునానరు. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారడంతోపాటు తరచూ ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. ముఖ్యంగా ద్వారకానగర్‌, డాబాగార్డెన్స్‌, జగదాంబ జంక్షన్‌, ఆశీల్‌మెట్ట వంటి ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒకరినిచూసి మరొకరు అన్నట్టు సెల్లార్‌లను వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడం సాధారణ విషయంగా మారిపోయింది. ఆయా ప్రాంతాల్లో వస్త్రదుకాణాలు ఎక్కువగా ఉండడంతో నిత్యం జనసమ్మర్థం ఉంటుంది. దుకాణాల్లో షాపింగ్‌చేసేందుకు వచ్చేవారికి పార్కింగ్‌ సదుపాయం లేకపోవడంతో రోడ్లపైన, దుకాణాల ముందు వాహనాలను నిలిపివేస్తున్నారు. పండుగ సమయాలు, ప్రత్యేక సీజన్లలో వాణిజ్య, మార్కెట్‌ ప్రాంతాల్లో రోడ్లపై నుంచి వాహనాలు రాకపోకలు సాగించడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడుతోది.

దీనిపై నగరవాసులతోపాటు దుకాణాల్లో షాపింగ్‌ వెళ్లేవారి నుంచి పోలీస్‌, జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతుంటాయి. అయినా అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి. సంక్రాంతి సీజన్‌ ప్రారంభం కావడంతో వస్త్రదుకాణాలకు జనం తాకిడి పెరిగింది. పండుగ సమీపించే కొద్దీ ఇది మరింత ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో వస్త్రదుకాణాలు ఎక్కువగా ఉన్న డాబాగార్డెన్స్‌, ద్వారకానగర్‌, జగదాంబ ప్రాంతాల్లో ముందుగా సెల్లార్ల ఆక్రమణలు తొలగించాలని జీవీఎంసీ కమిషనర్‌ భావిస్తున్నారు. ఆ ప్రాంతాల్లోని వస్త్ర దుకాణాలతోపాటు ఇతర వాణిజ్య భవనాల్లో సెల్లార్లను కేవలం పార్కింగ్‌కు మాత్రమే వినియోగించేలా చూడాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం సెల్లార్ల ఆక్రమణల తొలగింపు ప్రక్రియను కూడా ‘ఆపరేషన్‌ లంగ్స్‌’ మాదిరిగానే చేపట్టాలని నిర్ణయించారు. దీనికోసం కార్యాచరణ సిద్ధమైందని, త్వరలోనే కార్యక్రమానికి శ్రీకారం చుడతారని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Dec 22 , 2025 | 01:27 AM