శబరిమలకు ప్రత్యేక బస్సులు
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:51 PM
శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్లాలనుకునే భక్తుల రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ విశాఖ రీజియన్ ప్రత్యేక బస్సులు నడపనున్నది. 5, 6, 7 రోజుల యాత్రల పేరిట ఈ బస్సులను నడపనున్నారు. నవంబరు 16 నుంచి డిసెంబరు 27 వరకు వీటిని ఆపరేట్ చేయనున్నారు.
నవంబరు 16 నుంచి ప్రారంభం
5, 6, 7 రోజుల పేరిట ప్రత్యేక ప్యాకేజీలు
ఆర్టీసీ ఆర్‌ఎం అప్పలనాయుడు
ద్వారకాబస్‌స్టేషన్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్లాలనుకునే భక్తుల రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ విశాఖ రీజియన్ ప్రత్యేక బస్సులు నడపనున్నది. 5, 6, 7 రోజుల యాత్రల పేరిట ఈ బస్సులను నడపనున్నారు. నవంబరు 16 నుంచి డిసెంబరు 27 వరకు వీటిని ఆపరేట్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టరును శనివారం ద్వారకా కాంప్లెక్సులోని ఆర్‌ఎం కార్యాలయంలో రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు ఇతర అధికారులు ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ గంగాధర్, పర్సనల్ ఆఫీసర్ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
5 రోజుల యాత్ర ప్యాకేజీ..
విశాఖ నుంచి బయలుదేరే ఈ బస్సు విజయవాడ, మేల్ మరుతుర్, ఎరుమేలి, పంబ నుంచి సన్నిదానినికి చేరుకుంటుంటి. అక్కడ స్వామివారి దర్శనానంతరం శ్రీపురం, కాణిపాకం, తిరుపతి, విజయవాడ మీదుగా విశాఖ చేరుకుంటుంది. ఇందుకు గాను ఒక్కొక్కరికి సూపర్ లగ్జరీ బస్సుకు రూ.6,600, ఇంద్ర ఏసీ బస్సుకు రూ.8,500గా ఆర్టీసీ నిర్ణయించింది.
6 రోజుల యాత్రకు..
విశాఖ నుంచి బయలుదేరే ఈ బస్సు విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవానీ, పళని, ఎరుమేని, పంబ నుంచి స్వామివారి సన్నిదానానికి చేరుకుంటుంది. అక్కడ అయ్యప్ప దర్శనమయ్యాక తిరుపతి, శ్రీకాళహస్తి, అన్నవరం సత్యనారాయణస్వామిని భక్తులు దర్శించుకున్న తరువాత విశాఖకు చేరుకుంటుంది. ఇందుకోసం ఒక్కొక్కరికి సూపర్ లగ్జరీ బస్సుకు రూ.7,000, ఇంద్ర ఏసీ బస్సుకు రూ.9,000ను వసూలు చేస్తారు.
7 రోజుల యాత్రకు..
విశాఖ నుంచి బయలుదేరే బస్సు విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవానీ, పళని, ఎరుమేని, పంబలను దర్శించుకున్నాక సన్నిదానానికి చేరుకుంటుంది. అక్కడ అయ్యప్ప స్వామి దర్శనమయ్యాక మధురై, రామేశ్వరం, తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ, ద్వారపూడి, అన్నవరం ఆలయాల్లో స్వామివారిని దర్శించుకున్నాక విశాఖ చేరుకుంటుంది. ఇందుకోసం ఒక్కొక్కరికి సూపర్ లగ్జరీ బస్సుకు రూ.7,600, ఇంద్ర ఏసీ బస్సుకు రూ.10,000 చొప్పున వసూలు చేయడం జరుగుతుంది. ఆర్టీసీ ఆన్‌లైన్‌లో టిక్కెట్లను రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు 7382914219 సెల్ నంబర్‌ను సంప్రదించవలసిందిగా ఆర్‌ఎం కోరారు.