Share News

పంచారామాలకు ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - Nov 10 , 2025 | 12:06 AM

పంచారామాల క్షేత్ర దర్శినికి సంబంధించి మూడు ప్రత్యేక సర్వీసులు ఆదివారం సాయంత్రం ద్వారకాబస్‌స్టేషన్‌ నుంచి బయల్దేరాయి.

పంచారామాలకు ప్రత్యేక బస్సులు

ద్వారకాబస్‌స్టేషన్‌, నవంబరు 9(ఆంధ్రజ్యోతి):

పంచారామాల క్షేత్ర దర్శినికి సంబంధించి మూడు ప్రత్యేక సర్వీసులు ఆదివారం సాయంత్రం ద్వారకాబస్‌స్టేషన్‌ నుంచి బయల్దేరాయి. ఉన్నతాధికారులు భక్తులను బస్సెక్కించారు. సోమవారం ఉదయం అమరావతి చేరుకుంటాయి. అక్కడ అమరేశ్వరుని దర్శనానంతరం భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట ఆలయాలకు చేరుకుంటాయి. ఆయా ఆలయాల్లో భక్తులు శివదర్శనం చేసుకున్న తరువాత సోమవారం రాత్రికి తిరిగి ద్వారకాబస్‌స్టేషన్‌కు చేరుకుంటాయి. ఈ సర్వీసులు శని, ఆదివారాల్లో నడుపుతున్నట్టు ఆర్‌ఎం బి.అప్పలనాయుడు తెలిపారు. 35 మంది భక్తులు బృందంగా పంచారామాలకు వెళ్లాలనుకుంటే ఏరోజైనా ప్రత్యేక బస్సు నడుపుతామన్నారు.

పుట్టపర్తికి ప్రత్యేక సర్వీసులు

పుట్టపర్తి సత్యసాయిబాబా శతజయంత్యుత్సవాల సందర్భంగా ఈనెల 19 నుంచి ఐదు రోజుల పాటు ద్వారకాబస్‌స్టేషన్‌ నుంచి పుట్టపర్తికి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ప్రయాణికుల డిమాండ్‌ మేరకు ఏసీ, నాన్‌ ఏసీ సర్వీసులు నడుపుతామని ఆర్‌ఎం వెల్లడించారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.


నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

విశాఖపట్నం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):

కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో కార్యకమాన్ని రద్దుచేసినట్టు కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌ తెలిపారు. ఈనెల 14,15 తేదీల్లో నగరంలో న్విహించనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమైనందున పీజీఆర్‌ఎస్‌ రద్దుచేస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే సోమవారం యథావిధిగా నిర్వహిస్తామన్నారు. ఇవే కారణాలతో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, పోలీస్‌ కమిషనరేట్‌లో జరగాల్సిన పీజీఆర్‌ఎస్‌ను రద్దుచేస్తున్నట్టు జీవీఎంసీ కమిషనర్‌, సీపీ తెలిపారు.


నేటి నుంచి సమ్మేటివ్‌ పరీక్షలు

జిల్లాలో 1.85 లక్షల మంది విద్యార్థులు

ఎంఆర్సీ, క్లస్టర్‌ కాంప్లెక్స్‌లలో ప్రశ్నపత్రాలు

విశాఖపట్నం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు సోమవారం నుంచి సమ్మేటివ్‌-1 పరీక్షలు జరగనున్నాయి. తొలి రోజు సోమవారం ఉన్నత పాఠశాలల విద్యార్థులు, మంగళవారం నుంచి ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయిజ

ఈనెల 19వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులు 76 వేలు, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 1.09 లక్షలు వెరసి 1.85 లక్షల మంది రాయనున్నారు. ఒకటి నుంచి ఐదు, ఎనిమిది నుంచి పదోతరగతి వరకు విద్యార్థులకు ఉదయం, ఆరు, ఏడు తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఈనెల 11న తెలుగు, 12న ఇంగ్లీష్‌, 13న గణితం, 14న ఈవీఎస్‌, 15న ఓఎస్‌ఎస్‌సీ పరీక్షలు నిర్వహిస్తారు. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సోమవారం తెలుగు, 11న హిందీ, 12న ఇంగ్లీష్‌, 13న గణితం, 14న జనరల్‌ సైన్స్‌, ఫిజికల్‌ సైన్స్‌, 15న బయాలజీ సైన్స్‌, 17న సోషల్‌ స్టడీస్‌ పరీక్షలు జరుగుతాయి. ఓరియంటల్‌ పాఠశాలల విద్యార్థులకు 18వ తేదీన సంస్కృతి/హిందీ/అరబిక్‌/పర్షియాలో పేపర్‌ 1, 19 పేపరు-2 పరీక్ష నిర్వహిస్తారు.

ఒకటోతరగతి నుంచి ప్రతి పేపరు 80 మార్కులు, పదోతరగతిలో 100 మార్కులకు ప్రశ్నపత్రాలను ఎస్‌సీఈఆర్‌టీ రూపొందించి జిల్లాలకు పంపింది. ఉన్నత పాఠశాలల ప్రశ్నపత్రాలు మండల రిసోర్స్‌ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల ప్రశ్నపత్రాలు క్లస్టర్‌ కాంప్లెక్స్‌లలో భద్రపరిచారు. ప్రతి రోజు పరీక్ష ప్రారంభానికి గంట ముందు పాఠశాలలకు ప్రశ్నపత్రాలు అందజేయాలని విద్యాశాఖ ఆదేశించింది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలనిఎంఈవో/ప్రధానోపాధ్యాయులకు సూచించింది. ఈనెల 25వతేదీలోగా జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తిచేసి నెలాఖరులోగా విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులు అందజేయాలని ఆదేశించింది. జిల్లాలో సమ్మేటివ్‌ పరీక్షలకు సంబంధించి అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో ప్రేమ్‌కుమార్‌ ఆదేశాలు జారీచేశారు.


పోలీస్‌స్టేషన్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

ప్రియుడితో పెళ్లి చేయలేదని మనస్తాపం

ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు

గాజువాక, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):

ప్రేమించిన వాడితో పోలీసులు పెళ్లి చేయలేదనే మనస్తాపంతో ఓ యువతి గాజువాక పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఆదివారం నెయిల్‌ పాలిష్‌ తాగి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

అనకాపల్లి జిల్లా ఎలమంచిలికి చెందిన యువతి, అనకాపల్లికి చెందిన వీరయ్యస్వామి అచ్చుతాపురంలోని ఓ సంస్థలో పనిచేసేవారు. ఈ క్రమంలో వారిద్దరిమధ్య పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. కొంతకాలం తరువాత యువతి అచ్చుతాపురంలో పని మానేసి గాజువాకలోని ఓ షాపింగ్‌ మాల్‌లో పనిచేస్తూ శ్రీనగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఏడేళ్ల పాటు కలిసి తిరిగిన వీరయ్యస్వామి పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో పది రోజుల కిందట గాజువాక పోలీసులను ఆశ్రయించింది. దీనిపై ఆదివారం పోలీసులు ఇద్దరినీ పిలిపించారు. ఈ క్రమంలో యువతి వీరాస్వామితో తనకు పెళ్లి చేయాలని పట్టుబట్టింది. పోలీసులు కౌన్సెలింగ్‌ ఇస్తుండగానే హ్యాండ్‌బ్యాగ్‌లోని నెయిల్‌ పాలిష్‌ తీసుకుని తాగేసింది. వెంటనే పోలీసులు ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గాజువాక సీఐ ఎ.పార్ధసారధి ఆస్పత్రికి వెళ్లి యువతిని విచారించారు. అయితే ప్రియుడిపై ఫిర్యాదు చేయడానికి ఆమె నిరాకరించి, పెళ్లి చేయాలని మాత్రమే పట్టుబడుతుండడంతో వీరయ్యస్వామితో చర్చిస్తున్నారు.

Updated Date - Nov 10 , 2025 | 12:06 AM