గిరిజనాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:39 AM
గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం తాజా మరో అడుగు ముందుకేసింది. జిల్లా సమగ్రాభివృద్ధికి జిల్లా అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే నిర్ణయించారు.
జిల్లా సమగ్రాభివృద్ధికి ‘ప్రత్యేక అభివృద్ధి అఽథారిటీ’ ఏర్పాటుకు సీఎం చంద్రబాబునాయుడు సూచన
జిల్లాల పునర్విభజనపై మంత్రులతో సమావేశంలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం తాజా మరో అడుగు ముందుకేసింది. జిల్లా సమగ్రాభివృద్ధికి జిల్లా అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం జిల్లాల పునర్విభజనపై మంత్రులతో అమరావతిలో నిర్వహించిన సమావేశంలో ఆయన సూచించారు.
శత శాతం గిరిజనులున్న జిల్లాగా ప్రత్యేక గుర్తింపు
జిల్లాలో మొత్తం 22 మండలాలు ఉండగా, వాటిలో పాడేరు ఐటీడీఏ పరిధిలో 11, రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 7, చింతూరు ఐటీడీఏ పరిధిలో 4 మండలాలున్నాయి. అలాగే మొత్తం 22 గిరిజన మండలాలు కావడంతో మూడు ఐటీడీఏల ద్వారా గిరిజనుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. అలాగే మూడు ఐటీడీఏలకు చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. జిల్లాలో అనంతగిరి మండలంలోని నాలుగు పంచాయతీలు మినహా మొత్తం జిల్లా అంతా ఐదో షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉంది. ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా అభివృద్ధి అథారిటీ ఏర్పాటు
ఇప్పటికే పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల ద్వారా గిరిజనుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్న కూటమి ప్రభుత్వం.. దానిని మరింత వేగవంతం చేయడంతోపాటు ప్రత్యేక అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. అయితే అథారిటీలో ఇంకా ఎవరెవరూ ఉంటారు, దాని విధి విధానాలు ఏమిటి అనేది రూపాందించాల్సి ఉంది. కలెక్టర్ చైర్మన్‌గా దానిని ఏర్పాటు చేస్తారని తెలిసింది. ఏదిఏమైనా గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.