గిరిజనాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:04 AM
గిరిజనాభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు.
ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ
నేటి నుంచి పక్షం రోజులు
జన జాతీయ గౌరవ దివాస్ మహోత్సవాలు
ఆది కర్మ యోగి అమలుతో పల్లెల్లో నాయకత్వం పెంపు
పాడేరు, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): గిరిజనాభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి ఐటీడీఏ ద్వారా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆది కర్మయోగి యోచనతో పల్లెల్లోని యువతలో నాయకత్వాలను పెంపొందించడంతో పాటు గ్రామాల్లోని ప్రజల అవసరాలను గుర్తించడం, పథకాలను అర్హులకు అందించడం వంటి చర్యలు చేపడుతున్నామన్నారు. ఫలితంగానే ఆది కర్మయోగి యోజన అమల్లో జాతీయ స్థాయిలో ఐటీడీఏకు అవార్డు దక్కిందని, అందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందికి ఆమె అభినందనలు తెలిపారు. అలాగే రానున్న ఐదేళ్లు గిరిజనుల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి మరింత కృషి చేస్తామన్నారు.
నేటి నుంచి గౌరవ దివాస్ మహోత్సవాలు
గిరిజన స్వతంత్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా శనివారం నుంచి రెండు వారాలు జన జాతీయ గౌరవ దివాస్ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు. తొలి రోజు స్థానిక కాఫీ హౌస్‌లో ప్రారంభోత్సవ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి, రోజుకొ అంశంపై వివిధ ప్రాంతాల్లో బిర్సాముండాకు నివాళులు అర్పిస్తూ గౌరవ దివాస్ మహోత్సవాలను నిర్వహిస్తామన్నారు. అలాగే ఇదే క్రమంలో గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలు, తదితర అంశాలను భావితరాలకు అందించేందుకు డాక్యుమెంట్ చేస్తామని, వివిధ నైపుణ్యాలు, కళలపై ఆసక్తి ఉన్న గిరిజనులు తమతో భాగస్వామ్యం కావాలని పీవో కోరారు. అలాగే పల్లెల్లో సంప్రదాయ వైద్య సేవలు అందిస్తున్న వారికి ఆధునిక వైద్య పద్ధతులపై అవసరమైన శిక్షణ అందిస్తామన్నారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో వారు ప్రథమ చికిత్సలు చేసేలా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, పరిపాలనాధికారి ఎం.హేమలత పాల్గొన్నారు.