Share News

గిరిజన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ

ABN , Publish Date - Oct 08 , 2025 | 01:00 AM

గిరిజన సంక్షేమ శాఖ విద్యాలయాల్లోని గిరిజన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి ఎం.ఎం.నాయక్‌ ఆదేశించారు.

గిరిజన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ
గిరి విద్యార్థుల ఆరోగ్యంపై ’ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం క్లిప్పింగ్‌

- రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి ఎం.ఎం.నాయక్‌ ఆదేశం

- ఐటీడీఏ పీవోలు, టీడబ్ల్యూ డీడీలు విధిగా విద్యాలయాలను పర్యవేక్షించాలని సూచన

పాడేరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ శాఖ విద్యాలయాల్లోని గిరిజన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి ఎం.ఎం.నాయక్‌ ఆదేశించారు. మన్యం పార్వతీపురం జిల్లాలోని కురుపాం ఆశ్రమ పాఠశాలలో సుమారు రెండు వందల మంది గిరిజన బాలికలు అస్వస్థతకు గురైన సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’లో గిరిజన విద్యార్థుల ఆరోగ్యానికి ఏదీ భరోసా?’ శీర్షికన మంగళవారం ప్రచురించిన ప్రత్యేక కథనానికి ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఐటీడీఏ పీవోలు, గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్లకు మంగళవారం సూచనలతో ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రతి గురువారం ఆశ్రమ పాఠశాలలకు సమీపంలోని పీహెచ్‌సీకి చెందిన వైద్య సిబ్బంది వెళ్లి విద్యార్థుల ఆరోగ్యాన్ని పరీక్షించాలన్నారు. ప్రతి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని, అందుకు నిధుల సమస్య లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే పీహెచ్‌సీ వైద్యులు ప్రతి నెలా ఆశ్రమ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించాలన్నారు. ఐటీడీఏ పీవోలు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు తమ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ విద్యాలయాలను పర్యవేక్షించాలన్నారు. కురుపాం గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో బాలికలు అస్వస్థతకు గురైన నేపథ్యంలో అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని, మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

Updated Date - Oct 08 , 2025 | 01:00 AM