Share News

వినతుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:39 PM

ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన వినతుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశించారు.

వినతుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌. తదితరులు

అధికారులకు కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశం

పీజీఆర్‌ఎస్‌లో 146 వినతుల స్వీకరణ

పాడేరు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన వినతుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలు సమర్పించిన అర్జీలను పక్కాగా పరిశీలించి, విచారణ జరిపి శాశ్వత పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఒకే సమస్యపై పీజీఆర్‌ఎస్‌లో పలు మార్లు అర్జీలు పెట్టుకునే పరిస్థితులు కల్పించవద్దన్నారు. ప్రభుత్వం సూచనలతో అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. అలాగే అర్జీదారులు సమర్పించిన వినతులు పరిష్కారానికి నోచుకోకుంటే 1100 నంబర్‌కు కాల్‌ చేసి సేవలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. అర్జీదారులు కాల్‌ సెంటర్‌ సేవలను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు.

పీజీఆర్‌ఎస్‌లో 146 అర్జీలు సమర్ఫణ...

స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఎంవీఎస్‌.లోకేశ్వరరావు ప్రజల నుంచి 146 వినతులను స్వీకరించారు. పెదబయలు మండలం గంపరాయి పంచాయతీ సుండ్రుపుట్టు గ్రామంలోని తాగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు బి.చిట్టిబాబు, ఎ.రామయ్య, వి.హరిశ్‌బాబు కోరారు. అలాగే ముంచంగిపుట్టు మండలం బరడ పంచాయతీ పిల్లగండువ గ్రామం వద్ద గెడ్డపై వంతెన నిర్మించాలని సర్పంచ్‌ ఎస్‌.పార్వతి కోరగా, తమ గ్రామానికి తారురోడ్డు నిర్మించాలని జి.మాడుగుల మండలం కోరాపల్లి పంచాయతీ లోకిటుముల గ్రామానికి చెందిన జి.సత్తిబాబు వినతిపత్రం సమర్పించారు. అలాగే డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ గొడసారు గ్రామానికి రోడ్లు మార్గమధ్యలో వంతెన నిర్మించాలని కె.దామోదర్‌ కోరగా, పెదబయలు మండలం గోమంగి పంచాయతీలోని మారుమూల గ్రామాలకు సైతం రోడ్లు నిర్మించాలని ఆయా ప్రాంతీయులు కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, సమగ్ర శిక్ష ఏపీసీ వీఏ.స్వామినాయుడు, డీఈవో పి.బ్రహ్మాజీరావు, జిల్లా పరిశ్రమల శాఖాధికారి ఆర్‌వీ.రమణారావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీవీ.పరిమిళ, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్‌, రోడ్ల, భవనాల శాఖ ఈఈ బాలసుందరబాబు, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్‌ , గ్రామ సచివాలయాల నోడల్‌ అధికారి పీఎస్‌.కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నందు, ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ జి.ప్రసాద్‌, సీపీవో ప్రసాద్‌, జాతీయ రహదారుల డిప్యూటీ తహశీల్దార్‌ వి.ధర్మరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2025 | 11:39 PM