Share News

సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ

ABN , Publish Date - Apr 04 , 2025 | 10:33 PM

ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీకోసం)లో ప్రజలు తమ దృష్టికి తీసుకు వచ్చే సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశించారు.

సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ
మీకోసంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, తదితరులు

జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశం

మీ కోసం కార్యక్రమంలో 105 వినతులు స్వీకరణ

పాడేరు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీకోసం)లో ప్రజలు తమ దృష్టికి తీసుకు వచ్చే సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీ కోసంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన అర్జీలపై సమగ్ర పరిశీలన జరపాలని, దానిని పరిష్కరించేందుకు అధికారులు కృషిచేయాలన్నారు. సమస్య పరిష్కారం కాకుంటే అందుకు గల కారణాలను ప్రజలకు తెలిపాలన్నారు.

మీ కోసంలో 105 వినతులు స్వీకరణ

స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీకోసంలో జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత తదితరులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి 105 వినతులను స్వీకరించారు. పెదబయలు మండలం లక్ష్మీపేట పంచాయతీ లుగతంగి గ్రామానికి సీసీ రోడ్డు వేయాలని గ్రామస్థులు కె.లక్ష్మణరావు, ఎస్‌.భీమేశ్వరరావు కోరగా, గిరిజన ప్రాంతంలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లను అధికారులు పరిశీలించి, తాగునీటిని పరీక్షించాలని ఆదివాసీ పరిషత్‌ ఉపాధ్యక్షుడు వంతాల నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. అలాగే చింతపల్లి మండలం లోతుగెడ్డ పంచాయతీ పరిధిలోని చెరపల్లి, మేడూరు, బందబయలు, లింగాచిగూడ, పిసిరిమామిడి, గొడ్లు మామిడి గ్రామాల్లో సీసీ రోడ్లను నిర్మించాలని సర్పంచ్‌ సునీల్‌కుమార్‌ కోరగా, ముంచంగిపుట్టు మండలం రావిడిపుట్టు గ్రామంలో అంబేడ్కర్‌ కాలనీకి విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని జి.అర్జునరావు, పి.మన్మథరావు, తదితరులు కోరారు. అలాగే జాతీయ రహదారి నిర్మాణంలో తన కాఫీ తోట ధ్వంసమైందని, నష్టపరిహారం అందించాలని జి.మాడుగుల మండలం గెమ్మిలి పంచాయతీ మద్దులబందకు చెందిన సుమిత్ర కోరగా, చింతపల్లి మండలం లబ్బంగిలోని చెక్‌డ్యామ్‌కు మరమ్మతులు చేపట్టి సాగునీరందించాలని డి.మోహనరావు, డి.జగన్నాథం, తదితరులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమం అనంతరం ఇద్దరు దివ్యాంగ డిగ్రీ విద్యార్థులైన వంతాల ఓనోత్‌, వంజంగి మంజుప్రియలకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. అలాగే ఇంటర్మీడియట్‌, ఆపైబడి చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు టచ్‌ఫోన్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ ఎన్‌.సూర్యలక్ష్మి, ఐటీడీఏ ఏవో హేమలత, గిరిజన సంక్షేమ విద్యాశాఖ డీడీ ఎల్‌.రజని, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నంద్‌, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ జి.డేవిడ్‌రాజు, గ్రామ సచివాలయాల జిల్లా నోడల్‌ అధికారి పీఎస్‌.కుమార్‌, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ జవహార్‌కుమార్‌, మైనర్‌ ఇరిగేషన్‌ డీఈఈ ఆర్‌.నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 10:33 PM