పీ4పై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:50 PM
పీ4లో పేద కుటుంబాలు, వారిని దత్తత తీసుకునే మార్గదర్శుల ఎంపికపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.
పీజీఆర్‌ఎస్‌పై కూడా..
అధికారులకు కలెక్టర్ ఆదేశం
పాడేరు, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పీ4లో పేద కుటుంబాలు, వారిని దత్తత తీసుకునే మార్గదర్శుల ఎంపికపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. పీజీఆర్‌ఎస్, పీ4పై వివిధ శాఖల అధికారులు సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించిన వినతులను పరిష్కరించాలన్నారు. దీనిపై సంబంధిత శాఖకు చెందిన జిల్లా అధికారి ఎండార్స్‌మెంట్ ఇవ్వడంతో పరిష్కారం అయిన తరువాత సంబంధిత అర్జీదారుతో అధికారి మాట్లాడాలన్నారు. అర్జీ పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించవద్దన్నారు. ఒకే సమస్యపై పదే పదే వినతులు అందే పరిస్థితులను కల్పించవద్దని అధికారులకు కలెక్టర్ సూచించారు. పీ4 అమలు తీరుపై అధికారులు క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, అర్హులైన వారికి ప్రయోజనం చేకూరేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్ గౌడ, రంపచోడవరం ఐటీడీఏ పీవో కె.సింహచలం, సబ్‌కలెక్టర్ శౌర్యమన్ పటేల్, చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్, ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్.లోకేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చింతలవీధి ప్రమాద బాధితులకు అండగా ఉంటాం
పాడేరు మండలం చింతలవీధి ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై కేజీహెచ్‌లో చికిత్సలు పొందుతున్న కొర్రా విశ్వ, వంతాల దాలిమ్మలను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి అందుతున్న వైద్య సేవలు, ఇతర సదుపాయాలపై ఆరా తీశారు. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చికిత్సలు చేయాలని కేజీహెచ్ వైద్యులకు కలెక్టర్ సూచించారు. అలాగే మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపడతామని, ప్రభుత్వం నుంచి వారికి నష్టపరిహారం వచ్చేలా చూస్తామని, గాయాలపాలైన వారికి అవసరమైన అన్ని వైద్య సేవలు అందిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.