Share News

గఘనయానం

ABN , Publish Date - Dec 30 , 2025 | 01:20 AM

విశాఖపట్నం విమానాశ్రయం గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ప్రయాణికులపరంగా 9.29 శాతం వృద్ధిని నమోదుచేసింది.

గఘనయానం

గత ఏడాదితో పోల్చి చూస్తే విమాన ప్రయాణికుల్లో 9.29 శాతం వృద్ధి

2024 జనవరి నుంచి నవంబరు నెలాఖరు వరకూ విశాఖ నుంచి 25,21,249 మంది రాకపోకలు

2025లో 27,55,635 మంది...

వినియోగదారుల సంతృప్తిలో విశాఖ విమానాశ్రయానికి తొమ్మిదో ర్యాంకు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం విమానాశ్రయం గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ప్రయాణికులపరంగా 9.29 శాతం వృద్ధిని నమోదుచేసింది. గత ఏడాది 2024 జనవరి నుంచి నవంబరు నెలాఖరు వరకూ విశాఖ విమానాశ్రయం నుంచి 25,21,249 మంది ప్రయాణించగా, 2025లో అదే కాలానికి 27,55,635 మంది ప్రయాణించారు. గత ఏడాది కంటే 2,34,386 మంది ఎక్కువగా ప్రయాణించారు.

విమానాశ్రయాల్లో వినియోగదారుల సంతృప్తిపై సర్వే నిర్వహిస్తారు. దీనిని కస్టమర్‌ శాటిస్‌ఫేక్షన్‌ ఇండెక్స్‌గా పరిగణిస్తారు. గతంలో విశాఖ 20 స్థానంలో ఉండేది. ఒకసారి 12, ఇంకోసారి 16...ఇలా డబుల్‌ డిజిల్‌లోనే ర్యాంకు వచ్చేది. ఈసారి (2025) రౌండ్‌ 1లో 4.92/5 మార్కులతో 9వ ర్యాంకు వచ్చిందని విమానాశ్రయం వర్గాలు తెలిపాయి. అంటే ప్రయాణికులకు విమానాశ్రయంలో కల్పించిన సౌకర్యాలు, అందిస్తున్న సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని భావిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే కొత్తగా అబుదాబీకి అంతర్జాతీయ విమాన సర్వీసు మొదలైంది. గత నవంబరు నెలలో ఇంటర్నేషనల్‌ కార్గో టెర్మినల్‌ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా విదేశాలకు సరకు రవాణా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. డొమెస్టిక్‌ కార్గో జనవరి నుంచి నవంబరు నెలాఖరు వరకు 4,902.87 టన్నులు రవాణా చేశారు.

ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు 27.5 లక్షల మంది విశాఖ విమానాశ్రయం నుంచి ప్రయాణించారు. అంటే నెలకు సగటున 2.2 లక్షల మంది. అత్యధికంగా నవంబరు నెలలో 2.7 లక్షల మంది వెళ్లారు. ఈ ఏడాది నవంబరు వరకూ రాకపోకలు సాగించిన అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 96,011. ఈ ప్రాంత అభివృద్ధికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా తరపున మరిన్ని సేవలు అందించడానికి ప్రయత్నిస్తామని విమానాశ్రయం డైరెక్టర్‌ ఎన్‌.పురుషోత్తం తెలిపారు.

2025లో నెలల వారీగా ప్రయాణికుల సంఖ్య

------------------------------

నెల ప్రయాణికులు

------------------------------

జనవరి 2,72,743

ఫిబ్రవరి 2,46,634

మార్చి 2,55,906

ఏప్రిల్‌ 2,44,665

మే 2,66,830

జూన్‌ 2,44,700

జూలై 2,26,254

ఆగస్టు 2,50,055

సెప్టెంబరు 2,24,235

అక్టోబరు 2,53,177

నవంబరు 2,70,436

Updated Date - Dec 30 , 2025 | 01:20 AM