దక్షిణాఫ్రికా రెండో విజయం
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:22 AM
మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీలో భాగంగా సోమవారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
అర్ధ సెంచరీలతో ఆదుకున్న మారిజానా కాప్, క్లో ట్రయాన్
పోరాడి ఓడిన బంగ్లాదేశ్
షర్మిన్ అక్తర్, షోర్నా అక్తర్ శ్రమ వృధా
విశాఖపట్నం-స్పోర్ట్స్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి):
మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీలో భాగంగా సోమవారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్‌లో మారిజాన కాప్ (56), క్లో ట్రయాన్ (62), చివర్లో డి క్లెర్క్ (37) రాణించడంతో బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో ఓటమి చెందింది. అయితే బంగ్లాదేశ్ పోరాట పటిమ ఆకట్టుకున్నది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ బ్యాటర్లపై దక్షిణాఫ్రికా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బంగ్లా ఓపెనర్లు ఫర్గాన హక్ (30), రబ్య హైదర్ (25) 16 ఓవర్లపాటు క్రీజులో నిలబడి తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 20 పరుగుల తేడాలో ఓపెనర్లు ఇద్దరూ అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన షర్మిన్ అక్తర్, కెప్టెన్ నిగర్ సుల్తానా (32) దక్షిణాఫ్రికా బౌలర్లపై దాడికి దిగి జట్టు స్కోరును 30 ఓవర్లలో వందకు చేర్చారు. నిగర్ సుల్తానా స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన షోర్న అక్తర్...షర్మిన్ అక్తర్ కలిసి వేగం పెంచడంతో 40 ఓవర్లలో జట్టు స్కోరు 150 పరుగులకు చేరింది. ఈ దశలో షర్మిన్ అక్తర్ 74 బంతుల్లో 6 బౌండరీలతో అర్ధ సెంచరీ పూర్తిచేసి అనూహ్యంగా రనౌటై పెవెలియన్‌కు చేరింది. షోర్నా అక్తర్ కేవలం 34 బంతుల్లో మూడు బౌండరీలు, మూడు సిక్సర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేయడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 232 పరుగులు చేసింది.
అర్ధ సెంచరీలతో ఆదుకున్న మారిజానా కాప్, క్లో ట్రయాన్
లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ బౌలర్లను ఎదుర్కోవడంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు తడబడ్డారు. కేవలం 78 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన దశలో మారిజానా కాప్ (56), క్లో ట్రయాన్ (62) అర్ధ సెంచరీలతో ఆదుకున్నారు. ఇద్దరూ క్రీజులో ఉన్నంతసేపు విజయం ఖాయమనుకున్న సమయంలో క్లో ట్రయాన్ రనౌట్ అవ్వడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. చివరి మూడు ఓవర్లలో మ్యాచ్ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. చివరి ఓవర్‌లో ఎనిమిది పరుగులు చేయాల్సి వచ్చింది. నహీద్ అక్తర్ వేసిన ఓవర్‌లోని మూడో బంతిని డీ క్లెర్క్ లాంగ్ ఆన్ మీదుగా కొట్టగా బౌండరీ లైన్ వద్ద షోర్న అక్తర్ క్యాచ్ జారవిడిచింది. తర్వాత బంతిని సిక్సర్‌గా మలిచి జట్టుకు విశాఖలో వరుసగా రెండో విజయాన్నందించింది.