Share News

బస్సు ప్రయాణికుల పాట్లు

ABN , Publish Date - Nov 15 , 2025 | 12:45 AM

ఎలమంచిలి నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల అవసరాకు సరిపడ ఆర్టీసీ బస్సులు నడపకపోవడంతో నిత్యం వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. ‘స్ర్తీ శక్తి’ పథకం అమలుకాకముందు నుంచే ఈ సమస్య వుండగా.. మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చిన తరువాత మరింత పెరిగింది. ఆక్యుపెన్సీ రేషియాకు అనుగుణంగా అధికారులు అదనంగా బస్సు సర్వీసులను ప్రవేశపెట్టకపోవడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం.

బస్సు ప్రయాణికుల పాట్లు
ఎలమంచిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సుల కోసం నిరీక్షిస్తున్న మహిళలు, విద్యార్థినులు.. రోజూ సాయంత్రంపూట ఇదే పరిస్థితి!

ప్రజల అవసరాలకు సరిపడ నడవని ఆర్టీసీ బస్సులు

కిక్కిరిసిపోయి ఓవర్‌లోడుతో నడుస్తున్న వైనం

పలుస్టేజీల్లో బస్సులు ఆపడంలేదని ప్రయాణికుల ఆరోపణ

సాయంత్రం అయితే జాతరను తలపిస్తున్న ఎలమంచిలి బస్టాండ్‌

బస్సెక్కాలంటే సాహసం చేయాల్సిన పరిస్థితి

ఎలమంచిలి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల అవసరాకు సరిపడ ఆర్టీసీ బస్సులు నడపకపోవడంతో నిత్యం వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. ‘స్ర్తీ శక్తి’ పథకం అమలుకాకముందు నుంచే ఈ సమస్య వుండగా.. మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చిన తరువాత మరింత పెరిగింది. ఆక్యుపెన్సీ రేషియాకు అనుగుణంగా అధికారులు అదనంగా బస్సు సర్వీసులను ప్రవేశపెట్టకపోవడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం వెళ్లే దినసరి కూలీలు, చిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు.

ఎలమంచిలిలో ఉన్న కళాశాలలు, పాఠశాలల్లో చుట్టుపక్కల గ్రామాలు/ మండలాలకు చెందిన సుమారు రెండు వేల మంది విద్యను అభ్యసిస్తున్నారు. వీరు రోజూ ఆయా గ్రామాల నుంచి ఎలమంచిలికి రాకపోకలు సాగిస్తుంటారు. కొంతమంది ఆటోలను ఆశ్రయిస్తుండగా ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులపైన.. అది కూడా పల్లెవెలుగు బస్సులపై ఆధారపడుతున్నారు. పాయకరావుపేట నుంచి అనకాపల్లి, విశాఖపట్నం వెళ్లే పల్లె వెలుగు బస్సులు నక్కపల్లి మండలంలోనే నిండిపోయి, చాలా మంది నిల్చుని వుంటున్నారు. దీంతో ఎస్‌.రాయవరం మండలానికి చెందిన ప్రయాణికులు బస్సు ఎక్కడానికి, కనీసం నిల్చుని ప్రయాణించడానికి కూడా చోటు వుండడంలేదు. ఈ కారణంగా ఆయా గ్రామాల స్టాప్‌ల వద్ద డ్రైవర్లు బస్సులను ఆపడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు సకాలంలో తరగతులకు హాజరుకాలేకపోతున్నారు. ప్రధానంగా ఎలమంచిలి చెంతనే ఉన్న రేగుపాలెం, పోతిరెడ్డిపాలెం, లైనుకొత్తూరు గ్రామాల విద్యార్థులకు ఈ సమస్య అధికంగా వుంది. అష్టకష్టాలు పడి పాఠశాల/ కళాశాలకు వెళితే.. మళ్లీ సాయంత్రం ఇంటికి రావడానికి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు ఎక్కడానికి యుద్ధమే చేయాల్సి వస్తున్నదని వాపోతున్నారు. అనకాపల్లి వైపు నుంచి అడ్డరోడ్డు, పాయకరావుపేట వైపు వెళ్లే పల్లెవెలుగు బస్సులు ఎలమంచిలి వచ్చేసరికి సీట్లన్నీ నిండిపోవడమే కాకుండా చాలా మంది నిల్చుని వుంటున్నారు. ఎక్కడ ఐదారుగురు బస్సు దిగితే.. వందమందికిపైగా బస్సు ఎక్కేవారు వుంటున్నారు. బస్సు రావడమే తరువాయి.. ఒక్కసారిగా తోసుకుంటూ గేటు వద్దకు వెళుతున్నారు. బస్సులో నిల్చుని వెళదామన్నా ఖాళీ లేని పరిస్థితి నెలకొంటున్నది. అబ్బాయిలు, యువకులు ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. అమ్మాయిలు, మహిళలు అంత సాహసం చేయలేక.. మరో బస్సు కోసం వేచి వుంటున్నారు. దీంతో ఇంటికి చేరేసరికి రాతి ఏడేనిమిది గంటల అవుతున్నదని విద్యార్థినులు వాపోతున్నారు. ఇక చిన్నపిల్లలు, లగేజీతో ప్రయాణించే మహిళల ఇక్కట్లు వర్ణనాతీతం. దీంతో పలువురు మహిళలు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎలమంచిలి మీదుగా మరిన్ని పల్లె వెలుగు బస్సులు నడిచేలాచర్యలు చేపట్టాలని ప్రయాణికులు, విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Nov 15 , 2025 | 12:45 AM