పరాయి పంచన పాట్లు
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:58 AM
పరాయి పంచన పాట్లు
అద్దె భవనాల్లో జిల్లాస్థాయి ప్రభుత్వ కార్యాలయాలు
ఇరుకు వసతితో ఉద్యోగులు, సందర్శకులకు అసౌకర్యం
పట్టణానికి దూరంగా కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్
రాకపోకలకు ప్రజలు, ఉద్యోగుల ఇక్కట్లు
అపార్టుమెంట్లు, ప్రైవేటు భవనాల్లో పలు శాఖల కార్యాలయాలు
కొత్త జిల్లా ఏర్పడి మూడున్నరేళ్లయినా సొంతగూటికి నోచుకోని దుస్థితి
‘ఆంధ్రజ్యోతి’ పరిశీలన
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
కొత్త జిల్లాలు ఏర్పాటై మూడున్నరేళ్లు దాటినా.. ఇంకా బాలారిష్టాలు తొలగలేదు. జిల్లా కేంద్రంగా ఏర్పడిన అనకాపల్లిలో ఎటువంటి ఎదుగుబొదుగూ లేదు. పరిపాలనకు కేంద్ర బిందువైన కలెక్టరేట్‌తోపాటు జిల్లా పోలీసు కార్యాలయం, ఇంకా పలు ప్రభుత్వ కార్యాలయాలు సొంతగూడుకు నోచుకోక, పరాయి పంచన నడుస్తున్నాయి. అత్యధిక శాతం ప్రభుత్వ కార్యాలయాలు అరకొర వసతుల నడుమ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దీంతో ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
పరిపాలన వికేంద్రీకరణ పేరుతో గత వైసీపీ ప్రభుత్వం 2022 ఏప్రిల్‌లో జిల్లాలను పునర్విభజించిన విషయం తెలిసిందే. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి కేంద్రంగా 24 మండలాలు, రెండు మునిసిపాలిటీలతో కొత్త జిల్లా ఏర్పడింది. అప్పటి ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా హడావిడిగా కొత్త జిల్లాలను ఏర్పాటుచేసింది తప్ప.. జిల్లాస్థాయి ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించలేదు. కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత రెండేళ్లపాటు వైసీపీ అధికారంలో వున్నప్పటికీ అనకాపల్లి జిల్లా ఒక్క ప్రభుత్వ శాఖకు కూడా నూతన భవనం నిర్మించలేదు. కనీసం భవనాల నిర్మాణానికి స్థలం కూడా కేటాయించలేదు. దీంతో మూడున్నరేళ్ల నుంచి ప్రభుత్వ కార్యాలయాలు అరకొర వసతుల నడుమ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పరిపాలనకు కేంద్ర బిందువైన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాన్ని అప్పట్లో అనకాపల్లి పట్టణానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలోని శంకరం పంచాయతీలో ఒక ప్రైవేటు విద్యా సంస్థకు చెందిన భవన సముదాయాల్లో ప్రారంభించారు. ఈ కార్యాలయాలు లూప్‌లైన్‌లో వుండడంతో సర్వీసు ఆటోలు వుండవు. దీంతో వివిధ మండలాల ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చి, అక్కడి నుంచి ఆటో మాట్లాడుకుని కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తున్నది.
పౌరసరఫరాల శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయాలు కూడా ఇక్కడే వున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు 45 వరకు ఉండాగా వీటిలో సుమారు 30 శాఖల కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. మిగిలిన శాఖలకు గతంలో వున్న డివిజన్ స్థాయి కార్యాలయాల్లోనే జిల్లాస్థాయి కార్యాలయాలను నిర్వహిస్తున్నారు.
జిల్లా బీసీ సంక్షేమ, సాధికార అధికారి కార్యాలయాన్ని అనకాపల్లి పట్టణంలోని ఒక అపార్టుమెంట్ సెల్లారులో వాచ్‌మన్ కోసం నిర్మించిన గదిలో నిర్వహిస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని శంకరం గ్రామంలోని ఒక సామాజిక భవనంలో ఏర్పాటు చేశారు. గృహ నిర్మాణ సంస్థ పీడీ కార్యాలయం, దేవదాయ, వ్యవసాయ, వాణిజ్య పన్నులు, జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, స్త్రీ శిశు సంక్షేమ, గనుల శాఖల కార్యాలయాల కోసం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేటు అపార్టుమెంట్లలో ఫ్లాట్‌లను అద్దెకు తీసుకున్నారు. ఈపీడీసీఎల్ కార్యాలయాన్ని ఒక ప్రైవేటు దుకాణ సముదాయంలో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చదరపు అడుగుకు నెలకు రూ.10 చొప్పున అద్దె చెల్లిస్తుంది. ఇక్కడ సాధారణ అద్దెలతో పోలిస్తే ప్రభుత్వం చెల్లించే అద్దె తక్కువగా వుండడంతో ప్రభుత్వ కార్యాలయాలకు పట్టణంలో అద్దె భవనాలు లభించని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను పట్టణానికి శివారులో, సమీపంలోని మండలాల్లో ఏర్పాటు చేశారు. పట్టు పరిశ్రమ కార్యాలయాన్ని సబ్బవరం మండలం అసకపల్లిలో ఒక చిన్న ప్రైవేటు భవనంలో నడుపుతున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో నిర్వహిస్తుండడంతో ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు.
అనకాపల్లికి రాని కేంద్ర ప్రభుత్వ శాఖలు
అనకాపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడి మూడున్నరేళ్లు దాటినప్పటికీ కేంద్ర ప్రభుత్వ శాఖలు ఇంకా విశాఖ నుంచి అనకాపల్లికి తరలించలేదు. పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ఔషధ తయారీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. వీటికి సంబంధించి కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాన్ని అనకాపల్లిలో ఏర్పాటు చేయలేదు. ఎన్‌హెచ్‌ఏఐ, కేంద్ర వాణిజ్య పన్నులు, ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాలన్నీ విశాఖలోనే కొనసాగుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అనకాపల్లిలో ఎన్ని కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉన్నాయి? ఏయే శాఖలకు భవనాలు నిర్మించాలి అన్న వివరాలను జిల్లా అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి పంపారు.