Share News

‘ఆంధ్రజ్యోతి’ చొరవతో సమస్యలకు మోక్షం

ABN , Publish Date - Jun 02 , 2025 | 12:55 AM

గాజువాక సమీపాన ఆటోనగర్‌ను ఆనుకుని ఉన్న తిరుమలనగర్‌ ప్రజలు పరిశ్రమల కాలుష్యంతో అల్లాడిపోయేవారు.

‘ఆంధ్రజ్యోతి’ చొరవతో సమస్యలకు మోక్షం

  • ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’కు స్పందన

  • నేడు తిరుమలనగర్‌లో సభ

  • హాజరు కానున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ‘ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్‌ వేమూరి ఆదిత్య

విశాఖపట్నం, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి):

గాజువాక సమీపాన ఆటోనగర్‌ను ఆనుకుని ఉన్న తిరుమలనగర్‌ ప్రజలు పరిశ్రమల కాలుష్యంతో అల్లాడిపోయేవారు. మురుగునీటి పారుదల వ్యవస్థ కూడా సక్రమంగా ఉండేది కాదు. చీకటి పడితే అంతా అంధకారమే. ఆయా సమస్యలను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకువచ్చింది. పరిష్కారానికి కృషి చేసింది.

తిరుమలనగర్‌లో ఈ ఏడాది జనవరి 28న ‘అక్షరం అండగా...పరిష్కారమే అజెండా’గా నినాదంతో చేపట్టిన కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్‌ బొండా జగన్‌తో పాటు జీవీఎంసీ, రెవెన్యూ, పోలీస్‌, ఏపీఐఐసీ, విద్యుత్‌ శాఖాధికారులు హాజరయ్యారు. అక్కడి ప్రజలు చెప్పినవన్నీ విన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో అధికారులు వాటికి పరిష్కారం చూపించారు. డంపింగ్‌ యార్డుగా మారిన ఏపీఐఐసీ ఖాళీ స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. అక్కడ ఉన్న చెత్తను తరలిస్తున్నారు. అలాగే కాలనీలోకి వస్తున్న మురుగు నీటిని మళ్లించేందుకు డైవర్షన్‌ కాలువ నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టారు. గెడ్డల్లో మురుగునీరు నిల్వ లేకుండా 15 రోజులకు ఒకసారి శుభ్రం చేస్తున్నారు. లో ఓల్టేజీ సమస్య పరిష్కారానికి అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ను వేశారు. అదేవిధంగా వడ్లపూడిలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ స్థలాన్ని తహశీల్దార్‌, సిబ్బంది పరిశీలించి బోర్డులు పెట్టారు. ఆ స్థలంలో లైబ్రరీ, వృద్ధాశ్రమం నిర్మించే ఆలోచనలో ఎమ్మెల్యే ఉన్నారు. స్థానిక యువతకు క్రీడా సదుపాయం కోసం ఖాళీగా ఉన్న 4.5 ఎకరాల జీవీఎంసీ స్థలంలో రూ1.15 కోట్లతో ప్రహరీ నిర్మాణానికి హామీ ఇచ్చారు. కాలనీవాసులకు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ అధికారులు బస్సును నడపబోతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తిరుమలనగర్‌లోని ఆర్యవైశ్య సామాజిక భవన్‌లో ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో సభ జరగనున్నది. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ‘ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్‌ వేమూరి ఆదిత్య, కార్పొరేటర్‌ బొండా జగన్‌, జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌, ఐలా కమిషనర్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొంటున్నారు. ముందుగా ఉదయం 9.30 గంటలకు కణితి మీ-సేవా కేంద్రం వద్ద ఆర్టీసీ బస్సును జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. పది గంటలకు సభలో పాల్గొని స్థానికులతో ముచ్చటిస్తారు.

Updated Date - Jun 02 , 2025 | 12:55 AM