సోలార్‌తో ఎత్తిపోతల పథకాలు
ABN , Publish Date - Oct 10 , 2025 | 10:47 PM
జిల్లాలో సోలార్ విద్యుత్ ఆధారంగా ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం నిర్ణయించింది. అందులో భాగంగా ఐదు ప్రదేశాలను ఎంపిక చేసింది. వీటి ఏర్పాటుతో 300 మంది గిరిజన రైతులకు చెందిన 211 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇందు కోసం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ రూ.1.63 కోట్లు మంజూరు చేశారు.
జిల్లాలో ఐదు చోట్ల ఏర్పాటుకు రూ.1.63 కోట్లు మంజూరు
211 ఎకరాల్లోని 300 మంది గిరిజన రైతులకు లబ్ధి
ప్రయోగాత్మకంగా ఏర్పాటుకు కసరత్తు
కలెక్టర్ దినేశ్‌కుమార్ చొరవపై గిరి రైతుల ఆనందం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
గిరిజన ప్రాంతంలో ఇన్నాళ్లు సాధారణ విద్యుత్ ఆధారంగా మాత్రమే ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేశారు. అయితే దానివలన విద్యుత్ బిల్లుల చెల్లింపులు సమస్యగా మారడంతో గిరిజన రైతులు ఎత్తిపోతల పథకాల నిర్వహణపై దృష్టిపెట్టని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సోలార్ విద్యుత్ ఆధారంగా వాటిని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. పాడేరు మండలంలోని కిండంగి పంచాయతీ సేరుబయలులోని రెండు పథకాలుండగా.. వాటిలో ఒక దానికి సోలార్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
అవగాహన లేమితో మూలకు చేరుతున్న పథకాలు
ఏజెన్సీలో ఖరీఫ్ సీజన్‌లో పంటలను వర్షాధారంపై పండిస్తున్నారు. దీంతో గిరిజనులు ఎత్తిపోతలపై ఆసక్తి కనబరచని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఒక ఎత్తిపోతల పథకం పరిధిలో ఉన్న ఆయకట్టు రైతులంతా ఒక కమిటీగా ఏర్పడి నిర్వహించుకోవాలి. అలాగే విద్యుత్ బిల్లులు, స్వల్ప మరమ్మతులు సైతం రైతులు భరించాలి. ఈ కారణంతో గిరిజన రైతులు ఏజెన్సీలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణపై శ్రద్ధపెట్టని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా విద్యుత్ బిల్లులు పేరుకుపోవడంతో పథకాలు మూలకు చేరాయి. ఈ పరిస్థితిని గుర్తించిన అధికారులు రైతులకు ఎటువంటి విద్యుత్ బిల్లుల సమస్య లేకుండా సోలార్ ఆధారంగా ప్రయోగాత్మకంగా ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే కూటమి ప్రభుత్వ పాలనలో గిరిజన రైతుల సాగునీటి వనరుల కల్పనకు చర్యలు చేపడుతుండడంపై గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.