Share News

సోలాపూర్‌ ప్రత్యేక రైలు వెలవెల

ABN , Publish Date - Oct 25 , 2025 | 11:29 PM

రైల్వేశాఖ అనకాపల్లి నుంచి సోలాపూర్‌కు 01478 నంబరుతో నడిపే ప్రత్యేక రైలుకు ప్రయాణికుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. శనివారం ఈ రైలు అనకాపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి సాయంత్రం 5.35 గంటలకు బయలుదేరింది.

సోలాపూర్‌ ప్రత్యేక రైలు వెలవెల
అనకాపల్లి నుంచి బయలుదేరిన సోలాపూర్‌ ప్రత్యేక రైలు

ప్రచారం లేక ప్రయాణికుల నుంచి స్పందన కరువు

అనకాపల్లి టౌన్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : రైల్వేశాఖ అనకాపల్లి నుంచి సోలాపూర్‌కు 01478 నంబరుతో నడిపే ప్రత్యేక రైలుకు ప్రయాణికుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. శనివారం ఈ రైలు అనకాపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి సాయంత్రం 5.35 గంటలకు బయలుదేరింది. ఎలమంచిలి, సామర్లకోట, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ జంక్షన్‌, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు జంక్షన్‌, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, పాకాల, పీలేరు, మదనపల్లి, కదిరి, ధర్మవరం, అనంతపూర్‌, గుంతకల్లు, అధోని, మంత్రాలయం, రాయచూర్‌, కృష్ణా, యాదగిరి, వాడి జంక్షన్‌, కలాబురాగి, గంగపూర్‌ రోడ్డు, దుదాని, అఖల్‌కోట్‌ మీదుగా సోలాపూర్‌ జంక్షన్‌కు ఆదివారం రాత్రి 11.50 గంటలకు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఈ రైలుకు ప్రచారం అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రయాణికుల నుంచి స్పందన కరువైంది. పట్టణ పరిసర ప్రాంతాల వారి కంటే విశాఖపట్నం, పెందుర్తి, సబ్బవరం, గాజువాక ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ప్రయాణికులు కుటుంబ సమేతంగా ప్రత్యేక వాహనాల్లో అనకాపల్లి రైల్వేస్టేషన్‌కు వచ్చి రైలు ఎక్కి ప్రయాణం సాగించారు. ఈ రైలులో రెండు ఏసీ బోగీలు, 12 స్లీపర్‌ క్లాసు బోగీలు, ఆరు జనరల్‌ బోగీలు ఉన్నప్పటికీ అనకాపల్లి నుంచి ప్రారంభమైన రైలులో ప్రయాణికుల సంఖ్య అంతంత మాత్రంగానే కనిపించింది. ఈ రైలు ప్రతీ శనివారం అనకాపల్లి నుంచి సోలాపూర్‌కు నవంబరు 29వ తేదీ వరకు నడుస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. సోమవారం తిరుపతికి ప్రత్యేక రైలు ఉంది. సోలాపూర్‌ రైలు కూడా తిరుపతి మీదుగా వెళ్లడంతో తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్లే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ రైల్వే స్టాండింగ్‌ బోర్డు చైర్మన్‌గా ఉండడంతో అనకాపల్లి నుంచి ఎన్నడూ లేనివిధంగా ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. సోమవారం తిరుపతికి, మంగళవారం సికింద్రాబాద్‌కి, బుధవారం నాందేడ్‌, శుక్రవారం కాచిగూడ, శనివారం సోలాపూర్‌లకు ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. సోమవారం అనకాపల్లి నుంచి వెళ్లే తిరుపతి స్పెషల్‌కు స్లీపర్‌ బోగీలు కూడా ఏర్పాటు చేయడంతో ప్రయాణికులకు రిజర్వేషన్‌ దొరికే అవకాశాలున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.

13న బెంగళూరుకు ప్రత్యేక రైలు

అనకాపల్లి నుంచి బెంగళూరుకు నవంబరు 13వ తేదీన ప్రత్యేక రైలు అందుబాటులోకి రానున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ప్రశాంతి నిలయం సమీపంలోని ఎలహంకకు ఈ రైలు సత్యసాయి భక్తుల కోసం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 11:29 PM