ఆర్‌ఏఆర్‌ఎస్‌లో భూసార పరీక్షలు
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:13 AM
స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరిశోధన స్థానంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ల్యాబ్ గత ఏడాది అందుబాటులోకి వచ్చింది. శాస్త్రవేత్తలు ల్యాబ్‌లో మట్టి, సాగు నీరు నమూనాలు పరీక్షించి సకాలంలో ఫలితాలను రైతులకు అందజేస్తున్నారు. గిరిజన రైతులు భూసార పరీక్షలు చేయించుకుని ఫలితాల ఆధారంగా పోషకాల యాజమాన్యం చేపడితే వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించవచ్చునని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
- అందుబాటులో అత్యాధునిక ల్యాబ్
- నమూనాలు ఇచ్చిన రెండు రోజుల్లో మట్టి, సాగు నీరు ఫలితాలు
- ఫలితాల ఆధారంగా పోషకాల యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులు
- ల్యాబ్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని శాస్త్రవేత్తల సూచన
చింతపల్లి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరిశోధన స్థానంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ల్యాబ్ గత ఏడాది అందుబాటులోకి వచ్చింది. శాస్త్రవేత్తలు ల్యాబ్‌లో మట్టి, సాగు నీరు నమూనాలు పరీక్షించి సకాలంలో ఫలితాలను రైతులకు అందజేస్తున్నారు. గిరిజన రైతులు భూసార పరీక్షలు చేయించుకుని ఫలితాల ఆధారంగా పోషకాల యాజమాన్యం చేపడితే వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించవచ్చునని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రధానంగా పంట పొలాల్లో సేకరించిన మట్టి, సాగు నీటి నమూనా పరీక్షలు చేయించుకోవడం వల్ల భూమిలో ఉన్న పోషకాలు, లోపాలు రైతులకు తెలుస్తాయి. ఈ భూసార పరీక్షల ఆధారంగా పొలాల్లో వేసిన పంటలకు పోషకాలు(ఎరువులు) పెట్టుకోవడం వల్ల నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చునని వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల తరువాత ఖరీఫ్‌కి ముందు భూసార పరీక్షలను నిర్వహిస్తోంది. పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో గిరిజన రైతుల పంట పొలాల్లో సేకరించిన మట్టి నమూనాలను అనకాపల్లి రైతు శిక్షణ కేంద్రానికి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే మండలానికి 499 మట్టి నమూనాలను ప్రభుత్వం ఉచితంగా పరీక్షిస్తుంది. ఇప్పటికే రైతుల నుంచి మట్టి నమూనాలను సేకరించి అనకాపల్లి పంపించారు. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలోనున్న రీసెర్స్ కాంప్లెక్స్(ల్యాబ్)లో నామమాత్రపు ధరకు శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించి సాగునీరు, మట్టి నమూనాల ఫలితాలను అందజేస్తున్నారు. ఆసక్తి గల రైతులు సాగునీరు, మట్టి నమూనాలను ల్యాబ్‌కి అందజేస్తే శాస్త్రవేత్తలు ఫలితాలను వెంటనే అందజేస్తున్నారు. ఈ ఫలితాల ఆధారంగా సాగు చేసుకోవడం వల్ల నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అందుబాటులో ఉన్న భూసార పరీక్ష ఫలితాలు
పరిశోధన స్థానంలో నిర్వహించే భూసార పరీక్షల్లో ఆరు రకాల ప్రధాన ఫలితాలను శాస్త్రవేత్తలు అందజేస్తున్నారు. భూమి(మట్టి)లోని ఉదజని సూచిక(పీహెచ్) లవణ సాంద్రత(ఈసీ), సేంద్రీయ కర్బనం(ఓసీ శాతం), నత్రజని లభ్యత(కేజీ/హెక్టారు), భాస్వరం లభ్యత(కేజీ/హెక్టార్), పొటాషియం లభ్యత(కేజీ/హెక్టారు) ఫలితాలను అందజేస్తున్నారు.
సాగునీటి ఫలితాలు
సాగునీటిలో ప్రధానమైన పది రకాల ఫలితాలను పరీక్షించి శాస్త్రవేత్తలు అందజేస్తున్నారు. ఉదజని సూచిక(పీహెచ్), లవణ సాంద్రత(ఈసీ), సోడియం(ఎంఈ(మిల్లీలీటర్ ఈక్వలెంట్)/లీటర్), పొటాషియం(ఎంఈ/లీటర్), కాల్షియం(ఎంఈ/లీటర్), మెగ్నీషియం(ఎంఈ/లీటర్), కార్బొనేట్స్(ఎంఈ/లీటర్), బైకార్బోనేట్స్(ఎంఈ/లీటర్), క్లోరైడ్(ఎంఈ/లీటర్), సోడియం ఎడ్సప్సిన్ రేషియో(ఎంఈ/లీటర్) ఫలితాలను వెల్లడిస్తున్నారు.
విశ్వవిద్యాలయం నిర్ణయించిన ధరలు
భూసారం, సాగునీటి పరీక్షలకు విశ్వవిద్యాలయం వేర్వేరు ధరలను నిర్ణయించింది. భూసార పరీక్ష ఒక మట్టి నమూనాకు రూ.300, సాగునీరు ఒక నమూనాకు రూ.250 నామమాత్రపు ధరను నిర్ణయించింది. రైతులు మట్టి నమూనా భూసారం, సాగునీరు పరీక్షలు చేయించుకునేందుకు విశ్వవిద్యాలయం నిర్ణయించిన ధరలు చెల్లించాలి.