సమాజ సేవకులను ప్రోత్సహించాలి
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:17 PM
సమాజంలో మంచి పనులు చేస్తున్న వారిని అభినందించి, వారిని ప్రోత్సహించాలని ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు.
ఒడిశా గవర్నర్ డాక్టర్ హరిబాబు
అచ్యుతాపురం రూరల్, ఏప్రిల్ 28, (ఆంధ్రజ్యోతి): సమాజంలో మంచి పనులు చేస్తున్న వారిని అభినందించి, వారిని ప్రోత్సహించాలని ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. మండలంలోని కొండకర్లలో అనాఽథ, దివ్యాంగుల ఆశ్రమం ‘ఇచ్చా’ ఫౌండేషన్‌లో విశాఖకు చెందిన అవేకనింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి గవర్నర్ దంపతులు ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ లింబ్ ఫ్యాక్టరీ ద్వారా దివ్యాంగులకు ఉపకరణాలు తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేస్తున్నాన్నదని చెప్పారు. గతంలో తాను విశాఖ ఎంపీగా ఉన్న సమయంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సుమారు 2,500 మంది దివ్యాంగులను గుర్తించి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీతోపాటు ఎంపీ నిధులను వెచ్చించి ట్రై ఈ-సైకిళ్లను, ఇతర ఉపకరణాలను ఉచితంగా అందజేసినట్టు గుర్తు చేశారు. ప్రభుత్వంపై ఆధార పడకుండా దాతల సహాయంతో దివ్యాంగులకు ఇచ్చా ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఆశ్రమానికి పలువురు దాతలు ఇచ్చిన చెక్కులతోపాటు తన సొంత సొమ్ము రూ.25 వేలను నిర్వాహకులకు అందజేశారు. ఫౌండేషన్ ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం సమీపంలో కొండకర్ల ఆవను సందర్శించి, పకృతి అందాలను ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మధు తుగ్నైట్, సంస్థ ప్రతినిధులు ప్రసాద్, రమేశ్ రాజు, బీజేపీ నాయకులు గొంతిన భక్తసాయిరాం, రాజాన సన్యాసినాయుడు, అగ్గాల హనుమతరావు, నాయుడు తదితరులు పాల్గొన్నారు.