ఎన్నాళ్లీ కష్టాలు!
ABN , Publish Date - Oct 07 , 2025 | 01:42 AM
కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు వడ్డాది-పాడేరు రోడ్డులో ప్రయాణమంటే వాహనచోదకులు, ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.
వర్షాలతో దారుణంగా తయారైన వడ్డాది- పాడేరు రోడ్డు
అడుగడుగునా గోతులతో ప్రయాణికుల ఇక్కట్లు
మాడుగుల రూరల్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి):
కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు వడ్డాది-పాడేరు రోడ్డులో ప్రయాణమంటే వాహనచోదకులు, ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. వడ్డాది జంక్షన్ నుంచి మండల పరిధిలో తాటిపర్తి వరకు పలుచోట్ల భారీ గోతులు ఏర్పడి, రహదారి ఛిద్రమైంది. రాళ్లు, కంకర తేలిపోయాయి. గోతుల్లో వర్షం నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. 20 నిమిషాల్లో ప్రయాణించాల్సించాల్సి వుండగా గంటకుపైగా సమయం పడుతున్నదని వాహనదారులు వాపోతున్నారు. పైగా ఒళ్లు హూనమవ్వడంతో పాటు వాహనాల విడి భాగాలు పాడైపోతున్నాయని అంటున్నారు. ఈ మార్గంలో నిత్యం పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, కార్లు, జీపులు, ఆటోలు, వ్యాన్లు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ వాహనాల్లో వేలాది మంది ప్రయాణిస్తుంటారు. ముకుందపురం, కేజేపురం, ఎం.కోటపాడు, డి.సురవరం, సాగరం, ఎం.కోడూరు, కాశీపురం గ్రామాల వద్ద ఏర్పడిన గోతుల కారణంగా వీరంతా ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా రోడ్డు వేయడం మాట అటుంచి.. కనీసం గోతులైనా కప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.