Share News

మన్యంపై మంచు ముసుగు

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:27 PM

మన్యంలో ఆదివారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. పాడేరులో తెల్లవారుజాము నుంచి ఎనిమిది గంటల వరకు ఎదుట వ్యక్తులు కనిపించని విధంగా మంచు కురిసింది.

మన్యంపై మంచు ముసుగు
అరకులోయలో చలిమంటలు వేసుకున్న దృశ్యం

ఉష్ణోగ్రతలు తగ్గుముఖం

అరకులోయలో 6.8 డిగ్రీలు

పాడేరు, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఆదివారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. పాడేరులో తెల్లవారుజాము నుంచి ఎనిమిది గంటల వరకు ఎదుట వ్యక్తులు కనిపించని విధంగా మంచు కురిసింది. తాజా వాతావరణం పర్యాటకులు కనువిందు చేసేలా ఆహ్లాదకరంగా ఉంది. అలాగే వంజంగి, తాజంగి సందర్శనకు వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నది.

తగ్గుముఖం పడుతున్న ఉష్ణోగ్రతలు

గత కొన్ని రోజులుగా మన్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. అరకులోయలో ఆదివారం 6.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, జి.మాడుగుల, డుంబ్రిగుడలో 8.0, ముంచంగిపుట్టులో 8.1, హుకుంపేటలో 9.5, చింతపల్లి, పెదబయలులో 10.7, పాడేరులో 11.2, కొయ్యూరులో 13.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ముంచంగిపుట్టులో...

ముంచంగిపుట్టు: మండల పరిధిలో ఆదివారం చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం 10 గంటలు దాటినా మంచు తెరలు వీడలేదు. దీంతో వాహనాలు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించాయి. స్వెట్టర్లు ధరించి, చలి మంటలు వేసుకుని జనం ఉపశమనం పొందారు.

Updated Date - Nov 16 , 2025 | 11:27 PM