ఆర్టీసీ బస్సు నుంచి పొగలు
ABN , Publish Date - Sep 07 , 2025 | 10:56 PM
శాఖపట్నం నుంచి పాడేరుకు ప్రయాణికులతో ఆదివారం వస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక భాగం నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ వెంటనే స్పందించి బస్సును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.
భయాందోళనకు గురైన ప్రయాణికులు
మరో బస్సులో పాడేరుకు తరలింపు
పాడేరురూరల్, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నుంచి పాడేరుకు ప్రయాణికులతో ఆదివారం వస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక భాగం నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ వెంటనే స్పందించి బస్సును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించి ప్రయాణికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. విశాఖపట్నం నుంచి ప్రయాణికులతో పాడేరుకు ఆర్టీసీ బస్సు బయలుదేరింది. పాడేరు మండలంలోని వంతాడపల్లి అటవీశాఖ చెక్‌గేటు వద్దకు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చే సరికి బస్సు వెనుక భాగం నుంచి పొగలు రావడాన్ని స్థానికులు గుర్తించి డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. దీంతో డ్రైవర్ బస్సును నిలిపివేసి ప్రయాణికులకు ధైర్యం చెప్పారు. ఓవర్ లోడ్‌తో బస్సు ఘాట్ రోడ్డు ఎక్కిన నేపథ్యంలో వెనుక చక్రాల బ్రేక్ చాంబర్ రాపిడికి గురై పొగలు వచ్చినట్టు డ్రైవర్ తెలిపారు. బస్సును నిలిపి వేసి డ్రైవర్ మరో బస్సులో ప్రయాణికులను పాడేరు పంపారు. పాడేరు డిపో గ్యారేజ్ సిబ్బంది సూచనల మేరకు బస్సును పాడేరు డిపోనకు తరలించి మరమ్మతులు చేయించారు. సాయంత్రం 4.30 గంటలకు బస్సును సిద్ధం చేసి పాడేరు నుంచి ప్రయాణికులను విశాఖపట్నానికి తరలించారు.