ముసురు
ABN , Publish Date - Jun 11 , 2025 | 12:58 AM
రుతుపవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మంగళవారం ముసురు వాతావరణం నెలకొంది. అనకాపల్లి, పరవాడ, మాకవరపాలెం, సబ్బవరం, ఎస్.రాయవరం, కశింకోట, ఎలమంచిలి, మాడుగుల, మునగపాక, అచ్యుతాపురం, రావికమతం, తదితర మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో ఆకాశం మేఘావృతమై, అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి.
పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం
ఉరుములు, పిడుగులతో ఈదురుగాలులు
రాగల ఐదు రోజుల్లో మోస్తరు వర్షం కురుస్తుందని ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ వెల్లడి
అనకాపల్లి/ అగ్రికల్చర్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్): రుతుపవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మంగళవారం ముసురు వాతావరణం నెలకొంది. అనకాపల్లి, పరవాడ, మాకవరపాలెం, సబ్బవరం, ఎస్.రాయవరం, కశింకోట, ఎలమంచిలి, మాడుగుల, మునగపాక, అచ్యుతాపురం, రావికమతం, తదితర మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో ఆకాశం మేఘావృతమై, అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి. కొన్నిచోట్ల ఉరుములు, పిడుగులతోపాటు ఈదురుగాలులు వీచాయి. ఈ వర్షం కూరగాయల పంటలకు మేలు చేస్తుందని రైతులు చెబుతున్నారు.
కాగా సోమవారం వడగాడ్పులతో వేడి వాతావరణం నెలకొనగా, మంగళవారం ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై జల్లులు పడడంతో వాతావరణం చల్లగానే వుంది. దీంతో ప్రజలు ఊరట చెందారు. కాగా రాగల ఐదు రోజులు జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 35.2 డిగ్రీల మధ్య నమోదు అవుతాయని స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ ముకుందరావు తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను అనుకూలంగా మార్చుకుని కూరగాయల పంటలను... ముఖ్యంగా తీగజాతి పంటలను విత్తుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అరటిలో సిగతోక తెగులు ఆశించి, వర్షాలు అధికమైతే తెగులు వ్యాపించే అవకాశం ఉందని, దీని నివారణకు ప్రాపికోనజోల్ మందును పిచికారీ చేయాలని చెప్పారు. భూమిలో అధిక తేమ వల్ల అరటి దుంపలు కుళ్లిపోకుండా వుండడానికి కాపర్‌ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి మూడు గ్రాముల చొప్పున కలిపి దుంప చుట్టూ తడిసేలా మందు నీటిని పోయాలన్నారు.
ఎలమంచిలిలో పిడుగుల వర్షం
ఎలమంచిలి, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఈదురు గాలులు, ఉరుములు, పిడుగులతో సుమారు అర్ధగంటపాటు భారీ వర్షం కురిసింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఒక కొబ్బరి చెట్టుపై పిడుగు పడి కొమ్మలు కాలిపోయాయి. పిడుగుపడిన శబ్దానికి స్థానికులు భయాందోళన చెంది దూరంగా పరుగులు తీశారు. పలు ఇళ్లల్లో విద్యుత్, ఎలక్ర్టానిక్స్ సామగ్రి కాలిపోయాయి. పిడుగుల కారణంగా పలు విద్యుత్ ఫీడర్లు ట్రిప్ కావడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మరమ్మతు పనులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.