Share News

నేటి నుంచి స్మార్ట్‌ రైస్‌కార్డులు పంపిణీ

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:34 AM

క్యూఆర్‌ కోడ్‌తో ముద్రించిన స్మార్ట్‌ రైస్‌కార్డులను సోమవారం నుంచి పంపిణీ చేయనున్నారు.

నేటి నుంచి స్మార్ట్‌ రైస్‌కార్డులు పంపిణీ

సచివాలయాల ద్వారా అందజేతకు ఏర్పాట్లు

జిల్లాకు 5.17 లక్షల కార్డులు రాక

విశాఖపట్నం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి):

క్యూఆర్‌ కోడ్‌తో ముద్రించిన స్మార్ట్‌ రైస్‌కార్డులను సోమవారం నుంచి పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. ప్రతి నియోజకవర్గంలో ఒకచోట స్థానిక ఎమ్మెల్యేలతో కార్డులు పంపిణీ చేస్తారు. జిల్లాలో 5.24 లక్షల కార్డులుండగా ఇంతవరకు 5,17,149 మంది కార్డులు వచ్చాయి. మిగిలిన కార్డులకు సంబంధించి ఈకేవైసీ ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాటిని సరిచేసిన తరువాత చేరుతాయి.

జిల్లాకు చేరిన 5.17 లక్షల కార్డులను 642 రేషన్‌ డిపోలకు అందజేశారు. జిల్లా పౌరసరఫరాల అధికారి వి.భాస్కర్‌ ఆదివారం సర్కిల్‌-2లో కార్డులతో ఉన్న బాక్సులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కాగా ప్రతి రేషన్‌ డీలరు ఈ- పౌరసరఫరాలు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని డిపో నంబరు, డీలరు ఐడీ నమోదుచేశారు. డిపోలకు చేరిన కార్డులతో ఉన్న బాక్సులపై క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌చేసి ఆ వివరాలను యాప్‌లో నమోదు చేశారు. కార్డులను సోమవారం ఆయా డిపోల పరిధిలో గ్రామ/వార్డు సచివాలయాలకు అందజేయాలని ఆదేశించారు. సచివాలయాల పరిధిలో కార్డుదారులకు స్మార్ట్‌ రైస్‌కార్డులు పంపిణీ చేస్తారు. ప్రతికార్డుదారుని వివరాలను ఈ పోస్‌ ద్వారా ధ్రువీకరించుకున్న తరువాతే కార్డులు ఇవ్వనున్నారు. వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కార్డుల పంపిణీ వివరాలను ఉన్నతాధికారుల ద్వారా డాష్‌బోర్డుకు అప్‌లోడ్‌ చేయాలి. వచ్చేనెల 15వ తేదీ వరకు కార్డుల పంపిణీకి అవకాశం ఇచ్చారు. అందువల్ల కార్డుదారులు తమ పరిఽధిలోని సచివాలయాలకు వెళ్లి కార్డులు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి భాస్కర్‌ తెలిపారు.

Updated Date - Aug 25 , 2025 | 12:37 AM