Share News

స్మార్ట్‌ రేషన్‌ కార్డులు రెడీ!

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:58 AM

రేషన్‌ కార్డుల కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటికే వున్న కార్డుదారులతోపాటు కొత్తవారికి స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

స్మార్ట్‌ రేషన్‌ కార్డులు రెడీ!
ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన స్మార్ట్‌ రేషన్‌ కార్డు

జిల్లాలో 5,41,340 కుటుంబాలకు కార్డులు

నేటి నుంచి పంపిణీ

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

రేషన్‌ కార్డుల కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటికే వున్న కార్డుదారులతోపాటు కొత్తవారికి స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్‌ రేషన్‌ కార్డులను తయారు చేయించింది. ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్‌ కోడ్‌తో వీటిని రూపొందిచారు. జిల్లాలో ఇప్పటికే 5,32,340 కుటుంబాలకు రేషన్‌ కార్డులు ఉన్నాయి. కొత్తగా తొమ్మిది వేల కుటుంబాలకు రేషన్‌ కార్డులు మంజూరయ్యాయి. వీరందరికీ మొత్తం5,41,340 స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేసేందుకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. స్మార్ట్‌ రేషన్‌ కార్డుపై ఒకపైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కార్డుదారుల ఫొటో ఉంటుంది. రేషన్‌ కార్డు నంబర్‌, రేషన్‌ షాపు నంబర్‌, కుటుంబ సభ్యుల వివరాలను ముద్రించారు. రేషన్‌ డిపోలో వుండే ఈ-పోస్‌ యంత్రంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డును స్కాన్‌ చేసిన తరువాత రేషన్‌ పంపిణీ చేస్తారు. కాగా స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని జిల్లాలో శుక్రవారం ప్రారంభిస్తారు. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కార్డుదారులకు అందజేస్తారు. కాగా స్మార్ట్‌ రేషన్‌ కార్డుల్లో తప్పులు ఏమైనా వుంటే సరిచేయడానికి నిరంతరం దరఖాస్తులు స్వీకరిస్తామని, అదే విధంగా కొత్త రేషన్‌ కార్డుల కోసం కూడా దరఖాస్తులు అందజేయవచ్చని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి కేవీఎల్‌ఎన్‌ మూర్తి తెలిపారు.

Updated Date - Sep 12 , 2025 | 12:58 AM