స్మార్ట్ రేషన్ కార్డులు
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:40 AM
జిల్లాలో ఇప్పటి వరకు వున్న రేషన్ కార్డుల స్థానంలో నూతన కార్డులు రానున్నాయి. ఈ నెల 25వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డును ప్రభుత్వం జారీ చేసింది.
ఇప్పటి వరకు ఉన్న కార్డుల స్థానంలో కొత్తవి జారీ
ఈ నెల 25 నుంచి పంపిణీ
జిల్లాలో 5.4 లక్షల బియ్యం కార్డులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఇప్పటి వరకు వున్న రేషన్ కార్డుల స్థానంలో నూతన కార్డులు రానున్నాయి. ఈ నెల 25వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డును ప్రభుత్వం జారీ చేసింది. జిల్లాలో 5.3 లక్షలపైచిలుకు బియ్యం కార్డులు వున్నాయి. వీటితోపాటు కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న 12,759 మందిలో అర్హత పొందిన 9,369 మందికి కూడా స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయనున్నారు. స్మార్ట్ రేషన్ కార్డుపై కుటుంబ పెద్ద ఫొటో, పూర్తి వివరాలతోపాటు కుటుంబ సభ్యుల పేర్లు వుంటాయి. క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ కీ రిజిస్టర్‌తో వీటిని అనుసంధానం చేయనున్నారు. కార్డు ద్వారా జరిగే ప్రతి లావాదేవీ కేంద్ర కార్యాలయంలో నమోదు అయ్యేలా కార్డులు రూపొందిస్తున్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల వివరాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయగానే జిల్లాలో కార్డులు పంపిణీ చేయనునట్టు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మూర్తి తెలిపారు. కాగా కొత్త రేషన్ కార్డుల జారీ కోసం సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు.