రేషన్ డీలర్లకు స్మార్ట్ ఈ- పోస్ యంత్రాలు
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:03 PM
జిల్లాలో రేషన్ డీలర్లు, సేల్స్‌మన్‌లకు ఆధునిక స్మార్ట్ ఈ- పోస్ యంత్రాలు పంపిణీ చేస్తున్నామని, వచ్చే నెల నుంచి రేషన్ పంపిణీకి సాంకేతిక సమస్య ఉండదని పౌర సరఫరాల శాఖ పాడేరు డిప్యూటీ తహశీల్దార్ ప్రశాంత్‌కుమార్ తెలిపారు.
వచ్చే నెల నుంచి సాంకేతిక సమస్యకు చెక్
పౌర సరఫరాల శాఖ పాడేరు టీడీ ప్రశాంత్‌కుమార్
చింతపల్లి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో రేషన్ డీలర్లు, సేల్స్‌మన్‌లకు ఆధునిక స్మార్ట్ ఈ- పోస్ యంత్రాలు పంపిణీ చేస్తున్నామని, వచ్చే నెల నుంచి రేషన్ పంపిణీకి సాంకేతిక సమస్య ఉండదని పౌర సరఫరాల శాఖ పాడేరు డిప్యూటీ తహశీల్దార్ ప్రశాంత్‌కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక జీసీసీ డివిజన్ కార్యాలయంలో చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాలకు చెందిన రేషన్ డీలర్లు, సేల్స్‌మన్‌లకు స్మార్ట్ ఈ- పోస్ యంత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రేషన్ పంపిణీకి 2జీ, 3జీ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈ- పోస్ యంత్రాలను వినియోగించే వారన్నారు. ఈ యంత్రాలు కేవలం బీఎస్‌ఎన్‌ఎన్ సిగ్నల్స్ ఆధారంగా పనిచేసేవన్నారు. దీంతో గిరిజన ప్రాంతంలో మెజారిటీ డీఆర్ డిపోల పరిధిలో సాంకేతిక సమస్య కారణంగా ఆఫ్‌లైన్‌లో రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం పారదర్శకంగా పంపిణీ చేయడంతో పాటు డిజిటల్ విధానం అమలులోకి తీసుకొచ్చిందన్నారు. ఈ నూతన విధానం కోసం ఇప్పటికే ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసినట్టు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం రేషన్ డీలర్లు, సేల్స్‌మన్‌లకు ఆండ్రాయిడ్ 4జీ, 5జీ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన స్మార్ ఈ- పోస్ యంత్రాలను అందజేస్తుందన్నారు. ఈ యంత్రాలకు జియో సిమ్ సిగ్నల్స్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ యంత్రాలు వినియోగంలోకి రావడం వలన రేషన్ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో పంపిణీ జరుగుతుందని చెప్పారు. లబ్ధిదారులు అందుబాటులో ఉన్న రేషన్ దుకాణం నుంచి ఆన్‌లైన్ విఽధానంలో రేషన్ పొందవచ్చునన్నారు. ఈ యంత్రాల వల్ల సాంకేతిక సమస్య, వేలిముద్రలు పడకపోవడం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ సర్వీస్ ఇన్‌చార్జి శంకర్‌రావు, చింతపల్లి ఎంఎల్‌ఎస్ గోదాము ఇన్‌చార్జి ఎంవీ రమణమూర్తి పాల్గొన్నారు.