మందకొడిగా కాఫీ పల్పింగ్
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:08 PM
స్థానిక ఎకో పల్పింగ్ యూనిట్‌లో కాఫీ పల్పింగ్ మందకొడిగా సాగుతున్నది. ఐటీడీఏ నిర్వహణలో ఉన్న ది విశాఖ చింతపల్లి గిరిజన కాఫీ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్ (మ్యాక్స్) పండ్ల సేకరణలో ఈ ఏడాది వెనుకబడింది. కాఫీ పండ్లకు ధర ప్రకటించడంలో అపెక్స్ కమిటీ జాప్యం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
ధర ప్రకటించడంలో ఆలస్యం
పండ్ల సేకరణలో వెనుకబడిన మ్యాక్స్
గ్రేడ్లుగా విభజించి కొనుగోలు చేయడంపై
కాఫీ రైతులు వ్యతిరేకత
కాఫీ పండ్ల సేకరణ ధరలో వ్యత్యాసంపై అసంతృప్తి
చింతపల్లి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): చింతపల్లి మాక్స్ ఎకో పల్పింగ్ యూనిట్‌లో సాధారణంగా నవంబరు రెండో వారం నుంచి కాఫీ పల్పింగ్ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది నవంబరు మొదటి వారంలోనే కాఫీ పండ్ల దిగుబడి వచ్చినప్పటికీ అపెక్స్ కమిటీ కాఫీ పండ్ల ధరలను ఆలస్యంగా ప్రకటించింది. దీంతో మ్యాక్స్ నవంబరు 22 నుంచి పల్పింగ్ ప్రారంభించారు. నెలాఖరు నాటికి కేవలం 13 టన్నుల కాఫీ పండ్లను మాత్రమే పల్పింగ్ చేశారు. గత ఏడాదితో పోల్చుకుంటూ కాఫీ పల్పింగ్‌లో మ్యాక్స్ వెనుకబడింది. అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల్లో ఈ ఏడాది కాఫీ బెర్రీ బోరర్ కీటకం ఆశించింది. ఈ కీటకం ఆశించిన తోటల్లో కాయలను తొలగించి మొక్కలకు చికిత్స చేశారు. బెర్రీ బోరర్ కీటకం కారణంగా అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల కాఫీ పండ్లను తరలించడాన్ని జిల్లా అఽధికారులు నిషేధించారు. ఈ కారణంగా ఈ ఏడాది ఈ మూడు మండలాల నుంచి పండ్లను స్థానిక ఎకో పల్పింగ్ యూనిట్‌కి తీసుకురావడం లేదు. మూడు మండలాల కాఫీ పండ్లను స్థానికంగానే రైతులు పార్చిమెంట్ తయారు చేసుకుంటున్నారు. మిగిలిన ఏడు మండలాల నుంచి ఎకో పల్పింగ్ యూనిట్‌కి కాఫీ పండ్లను తీసుకొస్తున్నారు. మ్యాక్స్ ఈఏడాది కాఫీ పండ్లను గ్రేడ్లుగా విభజించింది. ఇంతవరకు ఎప్పుడు రైతుల నుంచి స్వీకరించే కాఫీ పండ్లకు గ్రేడ్లుగా విభజించిన దాఖలాలు లేవు. తొలిసారిగా మ్యాక్స్ ఏ గ్రేడ్ కిలో పండ్లకు రూ.60, బీ గ్రేడ్ పండ్లకు కిలోకి రూ.55 ధరగా నిర్ణయించింది. ప్రైవేటు వర్తకులు, మాతోట ఎఫ్‌పీవో, నాంది ఫౌండేషన్ కాఫీ పండ్లను రూ.60 నుంచి 65 ధరలకు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో పోటీ పెరగడంతో మ్యాక్స్‌కి ఆశించినంతగా కాఫీ పండ్లను రైతులు ఇవ్వడం లేదు. మ్యాక్స్ కచ్చితమైన తూనిక యంత్రాలతో తూకం చేసి, రైతులు ఎదుటనే ఏ గ్రేడ్, బీ గ్రేడ్‌గా విభజిస్తుంది. అయితే పండ్లను ఏ గ్రేడ్, బీ గ్రేడ్‌గా విభించి ధరలు కేటాయించడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. గతంలో మాదిరిగా గ్రేడ్లు లేకుండా కాఫీ పండ్లకు ఒకే ధర చెల్లించాలని రైతులు కోరుతున్నారు. మ్యాక్స్ ఈ ఏడాది 1700 టన్నుల కాఫీ పండ్ల సేకరణ లక్ష్యంగా చేసుకున్నది. ఇప్పటికి కేవలం 13 టన్నులు మాత్రమే సేకరించింది. దీంతో లక్ష్యం ఛేదించడం సాధ్యమేనా అనే సందేహం కలుగుతోంది. లైజనింగ్ అధికారులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టు అధికారులు అవగాహన కల్పిస్తేనే తప్ప రైతులు మ్యాక్స్‌కు పండ్లను ఇచ్చే అవకాశం లేదు.